కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా భారత్‌లో మరో వ్యాక్సిన్ అభివృద్ధికి తొలి అడుగులుపడ్డాయి. అమెరికా నోవావాక్స్ రూపొందించిన 'గ్లైకోప్రొటీన్ సబ్యూనిట్ నానోపార్టికల్ సహాయక వ్యాక్సిన్' క్లినికల్ అభివృద్ధి కోసం.. భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)లు జట్టు కట్టాయి.
ఈ అమెరికా వ్యాక్సిన్‌కు భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నట్లు లోక్‌సభ వేదికగా వెల్లడించారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే. అక్టోబర్ రెండోవారంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయని స్పష్టం చేశారు. ఈ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్, జాతీయ ఎయిడ్స్ పరిశోధన ఇన్స్టిట్యూట్- పుణె నేతృత్వం వహిస్తుందని తెలిపారు.
"భారత్ బయోటెక్, కాడిలా వ్యాక్సిన్లు తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తిచేసుకున్నాయి. ఉత్తమమైన ఫలితాలను కనబరిచాయి. రెండు వ్యాక్సిన్లు ప్రస్తుతం రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ చాడోక్స్-1 టీకాపై.. 14 కేంద్రాల్లో రెండు, మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. సీరమ్, కాడిలా, భారత్ బయోటెక్లతో పాటు ఏడు సంస్థలకు ప్రీ-క్లినికల్ పరీక్షలు, పరిశోధనలు, విశ్లేషణలకు.. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంటోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) లైసెన్స్‌లు ఇచ్చింది."
- అశ్విని కుమార్ చౌబే, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి
భారత్‌లోని అన్ని వ్యాక్సిన్ క్యాండిడేట్లు నూతన ఔషధ, క్లినికల్ ట్రయల్స్ నియమాలు-2019ను అనుసరిస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి. వాటికి అనుగుణంగానే ప్రీ-క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందని, ప్రతి 10లక్షల మందిలో పోలిస్తే ఇతర దేశాల కంటే పాజిటివ్ కేసుల సంఖ్య అత్యల్పంగా ఉందన్నారు.
ఇదీ చూడండి:ప్రపంచంపై కొవిడ్ విధ్వంసం- 3.04 కోట్లు దాటిన కేసులు