కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులకు భాజపా ప్రభుత్వ అసమర్థపాలనే కారణమని ధ్వజమెత్తారు. కేరళ వాయనాడ్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఉన్నావ్ బాధితురాలి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
న్యాయ పోరాటంలో దేశం మరో ఆడబిడ్డను కోల్పోయిందని ఆవేదన చెందారు. దేశంలో ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రధాని మోదీయే కారణమని ఆరోపించారు.
"దేశంలో పెరుగుతున్న హింసను మీరు చూస్తున్నారు. అడపిల్లలపై అన్యాయాలు, అరాచకాలు. ప్రతి రోజు మనం అత్యాచార, హత్యాచార ఘటనల గురించి చదువుతూనే ఉన్నాం. దళితులు, ముస్లింలపై హింస కూడా నానాటికి పెరిగిపోతుంది. దీనికి కారణం.. దేశాన్ని నడుపుతున్న ఆ వ్యక్తి(మోదీ). హింసాత్మకంగా, విచక్షణారహితంగా అధికారం చలాయించడాన్నే ఆయన నమ్ముతారు.
ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు మార్గనిర్దేశం కోసం భారత్ వైపు చూసేవి. ఇప్పుడు, మన దేశానికి ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు అని చిన్న చూపుతో చూస్తున్నాయి.
భారతదేశం ప్రపంచ అత్యాచార రాజధానిగా పేరుపొందింది. భారత్ తన కుమార్తెలు, సోదరీమణులను ఎందుకు కాపాడుకోలేకపోతోందని పలుదేశాలు ప్రశ్నిస్తున్నాయి. యుపీలో భాజపా ఎమ్మెల్యే ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు దానిపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఇదీ చదవండి:భారత్- అమెరికా మైత్రి వేగంగా బలపడుతోంది’