అమెరికాకు చెందిన 28 రకాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచుతున్నట్లు భారత్ ప్రకటించింది. ఉక్కు, అల్యూమినియం లాంటి భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రతిస్పందనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.
అమెరికా ఉత్పత్తులపై పెంచిన ఈ సుంకాలు ఆదివారం నుంచి అమలులోకి వస్తాయని అధికారిక నోటీసు విడుదల చేసింది. భారత చర్య అమెరికా ఎగుమతిదారులకు నష్టం చేకూరుస్తుంది. వారు అధిక సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా ఆ వస్తువులకు భారత మార్కెట్లలో ధర అధికమవుతుంది.
2017, జూన్ 30 నాటి నోటిఫికేషన్‌ను 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్' (సీబీఐసీ) సవరించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే 28 వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించామని తెలిపింది. అదే సమయంలో మిగతా దేశాల వస్తువులపై ఉన్న ఎమ్‌ఎఫ్‌ఎన్ రేట్లను సంరక్షిస్తామని స్పష్టం చేసింది.
అర్టేమియా రొయ్య
ఇంతకు ముందు 29 అమెరికా ఎగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న భారత్, తాజాగా ఆర్టేమియా అనే ఒక రకమైన రొయ్యను ఆ జాబితా నుంచి తొలగించింది.
అదనపు ఆదాయం..
అమెరికా వస్తువులపై సుంకాల పెంపుతో భారత్‌కు 217 మిలియన్ డాలర్ల అదనపు ఆదాయం లభిస్తుంది.
ప్రతీకారంగా..
ఉక్కు, అల్యూమినియం లాంటి కొన్ని భారత ఎగుమతులపై గణనీయంగా కస్టమ్స్ సుంకాలను పెంచాలని అమెరికా నిర్ణయించింది. ఈ చర్యకు ప్రతీకారంగా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచాలని నిర్ణయించింది భారత్.
2018 మార్చిలో భారత్ నుంచి ఎగుమతి అవుతున్న స్టీల్‌పై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం పన్నులను అమెరికా విధించింది. అంతకు ముందు ఈ ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు లేకపోవడం గమనార్హం. సుంకాలు పెంచిన కారణంగా దేశీయ ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై భారత్ 240 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయింది.
'జీఎస్పీ' రద్దు
భారత్‌కు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ) కింద ఇస్తున్న ప్రోత్సాహాకాలను అమెరికా ఉపసంహరించుకుంది. ఇది జూన్ 5 నుంచి అమలవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న సుమారు 5.5 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై ఈ ప్రభావం కనిపించింది.
ప్రతీకారంగా 28 అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలు పెంచింది. వాల్‌నట్‌పై దిగుమతి సుంకాన్ని 30 శాతం నుంచి 120 శాతానికి, చిక్పీస్, శనగలు, మసూర్ పప్పులపై 30 నుంచి 70 శాతం, కాయధాన్యాలపై 40 శాతం సుంకాలు పెంచింది.
బోరిక్ ఆమ్లం, బైండర్లపై 7.5 శాతం, దేశీయ కారకాలపై 10 శాతం సుంకాలు పెంచింది. అలాగే కొన్ని రకాల గింజలు, ఇనుము, స్టీల్, యాపిల్, పియర్స్, స్టెయిన్లెస్ స్టీల్, అలోయ్ స్టీల్, ట్యూబ్, పైప్ ఫిట్టింగులు, స్క్రూలు, బోల్ట్‌లు, రివర్టులపైనా సుంకాలు పెంచింది భారత్.
'డబ్ల్యూటీఓ'కు ఫిర్యాదు.
భారత్... తన ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకాలు పెంచడాన్ని సవాల్ చేస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించింది.
భారత్‌కే అనుకూలం..
ఏటా భారత్ నుంచి సుమారు 1.5 బిలియన్ డాలర్ల విలువైన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతాయి. భారత్ నుంచి అమెరికాకు 2017లో 47.9 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అదే సమయంలో అమెరికా నుంచి భారత్ 26.7 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులనే దిగుమతి చేసుకుంది. ఇది భారత్‌కే అనుకూలం.
ఇదీ చూడండి: 'కరవుపై సమీక్ష-వ్యవసాయంలో నిర్మాణాత్మక సంస్కరణ'