దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా.. ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి దశ ప్రారంభంకాలేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) పునరుద్ఘాటించింది. కరోనా బాధితులకు సన్నిహితంగా ఉన్నవారికే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలిపింది. కరోనా నుంచి కోలుకుంటున్నవారి శాతం 62కు పెరిగినట్లు ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త నివేదితా గుప్తా ప్రకటించారు. 60-75 ఏళ్ల వయసు వారిలోనూ రికవరీ రేటు ఎక్కువగానే ఉన్నట్లు చెప్పారు.
ప్రస్తుతం రోజుకు 2.6లక్షల వరకు కరోనా పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు నివేదిత. యాంటిజెన్ పరీక్షలతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు ఫార్మా సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నట్లు తెలిపారు.
వ్యాక్సిన్ అభివృద్ధిలో భద్రతా ప్రమాణాలపై రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపింది.