సరిహద్దుల్లో సైన్యాన్ని ఉపసంహరించుకుందామని చర్చల్లో చెప్పి, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న చైనాకు గట్టిగా బదులివ్వాలని భారత్ నిర్ణయించింది. మోహరింపుల విషయంలో పొరుగు దేశానికి దీటుగా స్పందించాలని తీర్మానించింది. వివాదాస్పద వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి సైన్యాన్నే కాక భారత్-టిబెట్ సరిహద్దు పోలీసు దళాన్ని (ఐటీబీపీ) కూడా అక్కడికి తరలిస్తోంది. సరిహద్దు శిబిరాల్లో సైనిక శక్తితోపాటు అవసరమైన సాధన సంపత్తిని కూడా మోహరిస్తోంది. సైనిక ఆపరేషన్ల విభాగం అధిపతి లెఫ్టినెంట్ జనరల్ పరంజీత్ సింగ్, ఐటీబీపీ అధిపతి ఎస్.ఎస్.దేశ్వాల్‌లు ఇటీవల లేహ్‌ను సందర్శించారు. ఆ తర్వాత ఐటీబీపీ బలగాలను మరింతగా పెంచాలన్న నిర్ణయం జరిగింది. ఈ నెల 15న గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగడానికి ముందే అదనపు బలగాలను పంపామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్యను మరింత పెంచుతున్నామని తెలిపారు. ఒక్కో గస్తీ కేంద్రంలో సైన్యానికి తోడ్పాటు అందించడానికి గతంలో ఒక ప్లటూను (30 మంది) మేర ఐటీబీపీ జవాన్లు ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్యను ఒక కంపెనీ (వంద మంది) స్థాయికి పెంచాలని నిర్ణయించినట్లు వివరించారు.
ఇంకా ఉద్రిక్తతంగానే..
మరోవైపు సోమవారం ఇరు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ అధికారుల స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, పాంగాంగ్ సరస్సు వద్ద పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 30కి ముందున్న నాటి పరిస్థితిని పునరుద్ధరించాలని భారత్ డిమాండ్ చేస్తోంది.
గల్వాన్, గోర్గాలోని పెట్రోలింగ్ పాయింట్స్ 14, 15, 17 వద్ద బలగాలను బాగా తగ్గించాలని రెండు దేశాల సైనికాధికారుల భేటీలో నిర్ణయం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే మరికొన్ని వారాల పాటు తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాకే ఈ మూడు చోట్ల వేడి చల్లారడానికి అవకాశం ఉంటుందని వివరించాయి. ఈ పెట్రోలింగ్ పాయింట్ల వద్ద చైనా భారీగా బలగాలను మోహరించి, నిర్మాణాలు చేపడుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి.
దీటుగా స్పందన
ఇక పాంగాంగ్ సరస్సు విషయానికొస్తే చైనా బలగాలు 'ఫింగర్-4' వరకూ చొచ్చుకొచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్కడికి దాదాపు 120కిపైగా వాహనాలు, పదికిపైగా బోట్‌లను తరలించిందని వివరించాయి. "ఎల్‌ఏసీకి సంబంధించి తనకున్న భావనలకు అనుగుణంగా చైనా భారీగా నిర్మాణాలను చేపడుతోంది. అందువల్ల అదనంగా బలగాలు, సాధన సంపత్తిని తరలిస్తున్నాం. భారత్, చైనాలు దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు సాగిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలోని బలగాలు మాత్రం సుదీర్ఘకాలం అక్కడే మోహరించడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుత సమస్య సమసిపోవడానికీ సుదీర్ఘకాలం పట్టొచ్చు. అందుకే అదనపు బలగాలను పంపుతున్నాం" అని పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: భారత్-నేపాల్ మధ్య 'వాచ్ టవర్' వివాదం