పాక్ చెరలో ఉన్న కుల్‌భూషణ్ జాదవ్ కేసులో చట్టపరమైన అంశాలను అన్వేషిస్తున్నట్లు భారత్ వెల్లడించింది. గూఢచర్యం కేసులో మరణశిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలుకు జాదవ్ నిరాకరించారని పాక్ ప్రకటనతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. జాదవ్‌ను రక్షించేందుకు అన్ని అవకాశాలను వినియోగిస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
మరణ శిక్ష రివ్యూ పిటిషన్‌ను కుల్భుషణ్ జాదవ్ తిరస్కరించారని పాక్ చేసిన ప్రకటన బూటకమని శ్రీవాస్తవ ఆరోపించారు. జాదవ్ హక్కులను వదులుకునేందుకు పాక్ బలవంతంగా చేస్తోన్న కుట్ర అని మండిపడ్డారు. ఐసీజే తీర్పును అమలు చేస్తున్నామని చెబుతూనే అంతర్జాతీయ చట్టాలను పాక్ ఉల్లంఘిస్తోందని విమర్శించారు.
పాక్ కిడ్నాప్...
గూఢచర్యం ఆరోపణలతో 2016లో ఇరాన్ నుంచి జాదవ్‌ను పాక్ ఏజెంట్లు అపహరించారు. బలూచిస్థాన్లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు మోపుతూ అరెస్టు చేశారు. 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్ మిలిటరీ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. అయితే ఇరాన్‌లో ఉంటున్న జాదవ్‌ను పాక్ కిడ్నాప్ చేసిందని భారత్ ఆరోపించింది.
పాక్ విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2017 మే 18న జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది. జాదవ్ గతంలో భారత నావికాదళంలో పనిచేశారు.
ఇదీ చూడండి: 'జాదవ్‌ను పాక్ బలవంతంగా ఒప్పించి ఉంటుంది'