ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశ ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ట్వీట్ చేశారు.
"దేశానికి కావాల్సింది ప్రచారం, అవివేక సిద్ధాంతాలు కాదు, ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు దృఢ ప్రణాళిక కావాలి. ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి గల సమస్యలను గుర్తించాం కావున వాటిని పరిష్కరించుకోవడానికి ఇదే మంచి సమయం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత.
చెన్నైలో మీడియా సమావేశంలో భాగంగా ఆటోమొబైల్ రంగంలో వృద్ధి మందగమనానికి.. కారు కొనుగోలు చేసే బదులు ఓలా, ఉబర్ వంటి వాటిని ఆశ్రయించాలనే ప్రజల ఆలోచనలతో పాటు చాలా కారణాలున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన రెండురోజుల అనంతరం రాహుల్ ఈమేరకు స్పందించారు. ఆర్థిక మాంద్యంపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు.
ఆర్థక మాంద్యంపై గందరగోళం ఎందుకు?
ఆర్థిక వృద్ధి మందగమనంపై భాజపా ప్రభుత్వం ఎందుకు అంత గందరగోళంలో ఉందని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఎన్నికలకు ముందు ఓలా, ఉబర్ ఉపాధిని పెంచాయని పేర్కొన్నవారే ఇప్పుడు ఆటోమొబైల్ రంగం మందగమనంపై వాటిని నిందిస్తున్నారని ట్వీట్ చేశారు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మీడియా నివేదికను ట్యాగ్ చేశారు.
ఇదీ చూడండి: గణేశుడి ముందు చిందులేసిన ట్రాఫిక్ పోలీసులు!