భారత్-చైనా మధ్య మేజర్ జనరల్ స్థాయిలో శనివారం జరిగిన చర్చల్లో.. బలగాల ఉపసంహరణ విషయం చర్చకు రాలేదని సైనిక వర్గాల సమాచారం. దౌలత్ బేగ్ ఓల్డి వేదికగా దాదాపు 10గంటల పాటు జరిగిన ఈ భేటీలో.. డెప్సాంగ్ వద్ద పరిస్థితి సహా పలు ఇతర అంశాలు చర్చించారు అధికారులు.
ప్రస్తావనే లేదు..
జూన్ 15న గల్వాన్‌లో జరిగిన హింసాత్మక ఘటన అనంతరం ఇరు దేశాలు మేజర్ జనరల్ స్థాయిలో చర్చలు జరపటం ఇదే ప్రథమం. అయితే బలగాల ఉపసంహరణ అంశం ప్రస్తావనకు రాలేదని.. వ్యూహాత్మక 'డెప్సాంగ్' మైదానాలకు సంబంధించిన సమస్యలపైనే చర్చించినట్టు సైనిక వర్గాలు తెలిపాయి.
ఇప్పటివరకు జరిగిన కమాండర్ స్థాయి సైనిక చర్చల్లో గల్వాన్ లోయ, గోగ్రా హాట్‌స్ప్రింగ్స్, పాంగాంగ్‌లోని ఫింగర్ ప్రాంతాలపైనే చర్చించినట్లు పేర్కొన్నాయి సైనిక వర్గాలు. అయితే ఇటీవల ఉద్రిక్తతలు పెరిగిన తరువాత.. తొలిసారిగా డెప్సాంగ్ సరిహద్దు నిర్వహణలో భాగంగా సాధారణ పెట్రోలింగ్ విధానాలపై చర్చ జరిగినట్లు తెలిపాయి.
డెప్సాంగ్ కొత్త సమస్యేం కాదు..
డెప్సాంగ్ కొత్త సమస్య కాదని, అక్కడ ఉండే సాధారణ సమస్యలపై చర్చించడానికి ఇలాంటి సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతాయని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనలో పాంగాంగ్‌తో పాటు డెప్సాంగ్ మైదానాలు కూడా ఉన్నాయి.
జూన్ 15న గల్వాన్ వద్ద హింసాత్మక ఘర్షణ తరువాత కల్నల్స్, బ్రిగేడియర్స్, మేజర్ జనరల్-స్థాయి సమావేశాలను నిలిపివేసి.. సైనిక, కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలకు మాత్రమే పరిమితమయ్యాయి ఇరు దేశాలు.
ఇదీ చూడండి:- 'ఆ ప్రాంతం నుంచి చైనా వెనక్కి మళ్లాల్సిందే!'