సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్-చైనా దేశాలు మేజర్ జనరల్ స్థాయిలో శనివారం సమావేశమయ్యాయి. లద్దాఖ్ సెక్టార్లోని వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల అధికారులు చర్చించినట్టు సైన్యాధికారుల సమాచారం.
"దౌలత్ బేగ్ ఓల్దీ ప్రాంతంలో ఇరు దేశాలు మేజర్ జనరల్ స్థాయిలో సమావేశమయ్యాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాల ఉపసంహరణపై చర్చించాయి."
--- భారత సైన్యం.
ముఖ్యంగా దేప్సంగ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే అంశంపై ఇరువర్గాలు దృష్టి సారించాయి. ఆ ప్రాంతంలో చైనా 17వేల సైనికులను మోహరించగా.. అందుకు దీటుగా భారత్ 15వేల జవాన్లను తరలించింది. ఇక్కడి నుంచి చైనా వెనక్కితరలాలని భారత్ పట్టుబడుతోంది.
మే నెలలో మొదలైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల ఇప్పటికే అనేకమార్లు మిలిటరీ, దౌత్య స్థాయిలో సమావేశమయ్యాయి. ఇటీవలే వీటి మధ్య ఐదో దఫా కార్ప్స్ కమాండర్ స్థాయిలో చర్చలు ముగిశాయి. చైనా దళాలు పూర్తి స్థాయిలో వెనుదిరిగి.. మే 5కు ముందున్న యథాతథ స్థితిని నెలకొల్పాలని భారత్ తేల్చిచెప్పింది.
ఇదీ చూడండి:- 'సరిహద్దులో కమాండర్లు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి'