ఇటీవల చైనా-భారత్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే లాద్దాఖ్లోని వాస్తవ ఆధీన రేఖ వెంబడి సుఖోయ్ సు-30ఎంకేఐ యుద్ధ విమానాలతో ఫింగర్3 ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు భారత అధికారులు.
లద్దాఖ్‌లోని పాంగోంగ్ త్సో సరస్సు ప్రాంతంలో గత వారం భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ చెలరేగింది. గస్తీ నిర్వహిస్తున్న ఇరు దేశాల సైనికులు గొడవపడ్డారు. ఈ ఘటనలో భారత్-చైనా బలగాల్లోని పలువురు గాయపడ్డారు. అనంతరం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మే 5న ఫింగర్ 2 వద్ద గస్తీ నిర్వహిస్తున్న భారత బలగాలను చైనా బలగాలు భౌతికంగా అడ్డుకోవడం వల్లే ఘర్షణ తలెత్తినట్లు భారత సైన్యం కల్నల్ ఆనంద్ వెల్లడించారు. అయితే ఇలాంటి ఘటనలు ఇక్కడ తరచూ జరుగుతూనే ఉంటాయని.. స్థానికంగా ఉన్న ఇరుదేశాల అధికారులు వీటిని పరిష్కరిస్తారని తెలిపారు. భారత్-చైనా మధ్య సరిహద్దు సమస్య ఉండటమే ఈ పరస్థితికి కారణమన్నారు.
ఘటన జరిగిన అనంతరం సిక్కిం సరిహద్దు షార్సింగ్మా సమీపంలో చైనా భారీగా బలగాలను, వాహనాలను మోహరించింది.
భారత బలగాలు అప్రమత్తం...
సరిహద్దులో భారత బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు సైన్యాధిపతి ఎంఎం నరవాణే. మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు యధావిధిగా కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవలే జరిగిన ఘటనలో ఇరు దేశాలకు చెందిన సైనికులు గాయపడినట్లు పేర్కొన్నారు.
సరిహద్దులో శాంతి కోసం...
సరిహద్దు ప్రాంతంలో శాంతిని పాటించడానికి భారత్ కట్టుబడి ఉందని విదేశాంగశాఖ ఉద్ఘటించింది. సరిహద్దుపై ఏకాభిప్రాయం ఉంటే ఇలాంటి ఉద్రిక్త ఘటనలు జరగకుండా ఉంటాయని స్పష్టం చేసింది.