భారత్-చైనా నేతల మధ్య భేటీ జరుగుతోందంటే అందులో ద్వైపాక్షిక వాణిజ్యం గురించి ప్రస్తావన రాకుండా ఉండకపోదు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు భారత్-చైనా మధ్య జరగనున్న చర్చలపై అందరి దృష్టి ఉంటుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చైనాకు భారత్ అతి కీలకమైన మార్కెట్ కూడా. ఎంతకీలకమైనది అంటే... ఇరుదేశాల మధ్య మిగిలిన అన్ని సంబంధాలు, ఉద్రిక్త వాతావరణాల్ని కూడా మించిన స్థాయిలో అంటే అతిశయోక్తి కాదు. వాణిజ్యపరమైన లావాదేవీల గణాంకాలే అందుకు నిదర్శనం. ఎంత బుసలు కొట్టినా డ్రాగన్ దిల్లీ విషయంలో ఆచితూచి అడుగులు వేయటానికి అదే అసలు కారణం.
ఒకరి అవసరం మరొకరికి
చాలా విషయాల్లో పాకిస్థాన్‌ను వెనకేసుకువస్తున్న డ్రాగన్ దేశంపై భారతీయులకు వ్యతిరేక భావన ఉండటం సాధారణమే. ఆ దేశానికి బుద్ది చెప్పాలంటే చైనా తయారీ వస్తువుల్ని బహిష్కరించాలని సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ వారు కోరుకుంటున్నట్టుగా ఆ దేశంతో వాణిజ్య బంధాలను తెంచు కోవడం అంత సులువుకాదు. చైనా పరిస్థితి కూడా అంతే. అమెరికాతో దీర్ఘకాలంగా సాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల వారి ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రత్యామ్నాయాల అన్వేషణ లో చైనాను విపరీతంగా ఆకర్షిస్తున్న నమ్మకమైన అతిపెద్ద విపణి భారత్.
భారత్‌కు..వాణిజ్యలోటు
ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్యం విషయానికి వస్తే చైనా ఎగుమతుల కన్నా భారత్ ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి. 2017-18 ఏప్రిల్-అక్టోబర్ వ్యవధిలో చైనాతో భారత్ వాణిజ్య లోటు 36.73 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాది లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం రికార్డు స్థాయిలో 95.54 డాలర్లకు చేరింది. ఈ ఏడాది వంద బిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుందని భావించినప్పటికీ తొలి ఐదు నెలల్లో 36.87 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యాన్ని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 3.59శాతం తగ్గుదల కనిపించింది.
హువావే కోసం
అంతేకాదు... భారత్, చైనా భేటీకి సిద్ధమవుతున్న తరుణంలో భారత్‌కు సరికొత్త ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. చైనా టెలికం దిగ్గజం హువావే 5జీ ట్రయల్స్ చేపట్టేందుకు భద్రతా అనుమతులు ఇవ్వరాదంటూ అమెరికా మోదీ సర్కారుపై ఒత్తిడి తీసుకొస్తోంది. దానిపై భారత్ పారదర్శకమైన స్నేహ పూర్వకమైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు చైనా భావిస్తోంది. భారత్ మార్కెట్‌లో తమ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చైనా ప్రోత్సహిస్తుందని.... అయితే ఇందుకు తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత భారత్‌దేని పరోక్షంగా హువావే అంశాన్ని ప్రస్తావిస్తోంది బీజింగ్.
వాణిజ్య భాగస్వామ్యం..
ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు చూస్తే... దక్షిణాసియాలో చైనా-భారత్ పరస్పరం అతి పెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తున్న విషయం. ఈ శతాబ్దం మొదట్లో 3 బిలియన్ డాలర్లుగా ఉన్న 2దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం క్రమేణా పెరుగుతూ వచ్చి వంద బిలియన్ డాలర్లకు చేరుకుంది . వెయ్యికి పైనే చైనా సంస్థలు భారత పారిశ్రామిక పార్కులు , ఈ – కామర్స్, తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. ఈ భాగస్వామ్యాలను మరింత పెంచుకోవటాని కి విస్తృతమైన అవకాశాలు ఎదురు చూస్తున్నాయి.
భారత్ ఎగుమతులు పెరుగుతున్నాయ్
ఇప్పటి వరకు భారత్‌లో చైనా సంస్థలు పెట్టిన పెట్టుబడుల విలువ దాదాపు 8 బిలియన్ డాలర్లుగా ఉంది. తద్వారా దాదాపు 2లక్షలమంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించినట్టు చైనా దౌత్య, పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. అలాగే చైనాలో ఉన్న భారతీయ సంస్థల్లో మూడింట రెండొంతుల కంపెనీలు లభాల బాటలో ఉన్నాయని చెబుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో భారత్ నుంచి చైనాకు దిగుమతులు 15 శాతం పెరిగాయని .. అదే సమయంలో చైనాతో వాణిజ్య లోటు ఈ ఏడాదిలో 13.5 శాతానికి పడిపోయిందని అంటున్నారు.
ఆర్సీఐపీ, బీసీఐఎమ్ ప్రస్తావన
ప్రస్తుతం జరగనున్న ద్వైపాక్షిక భేటీలో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఆర్సీఈపీపై సంప్రదింపులు, బంగ్లాదేశ్-చైనా-ఇండియా-మయన్మార్ బీసీఐఎమ్ ఆర్థిక నడవా ఒప్పందం, జపాన్ పెట్టుబడుల దిశగా భారత్ మొగ్గు వంటివి ప్రస్తావనకు రావచ్చని అంటున్నారు . చైనా-పాక్ ఆర్థిక నడవా విషయంలో భారత్ ఇప్పటికే తన అభ్యంతరాలు స్పష్టంగా తెలియజేసింది. అయితే ఈ నడవా ఆర్థిక సహకారానికి ఉద్దేశించిన ప్రాజెక్టు మాత్రమేనని, ఇందులో ఏ మూడో దేశాన్ని తాము లక్ష్యంగా చేసుకోలేదని చైనా చెబుతూ వస్తోంది.
సీపెక్ ప్రాజెక్ట్
సుమారు 50 బిలియన్ డాలర్లతో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సీపెక్ ప్రాజెక్టు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా వెళ్తుండటంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2015లో దాని సన్నాహాలు మొదలు పెట్టినప్పటి నుంచి దిల్లీ నాయకత్వం అదే స్థిరమైన వైఖరిని అవలంబిస్తోంది. ఇటీవల జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం... పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా త్వరలోనే భారత్‌లో భౌతిక భూభాగంగా చూస్తామన్న అధికారిక ప్రకటనలతో అది మరింత వేడెక్కింది. అందుకే ఇరునేతల మధ్య చర్చకు వచ్చే ముఖ్యమైన అంశాల్లో ఇది కూడా ఒకటి కావచ్చని అంటున్నారు.
వెల్లువెత్తుతున్న చైనా ఎగుమతులు
చైనాకు భారతదేశ ఉత్పత్తులు, ముఖ్యంగా ఔషధాల ఎగుమతిలో అనేక వాణిజ్య అవరోధాలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఆటబొమ్మల నుంచి విగ్రహాల వరకూ భారత మార్కెట్‌లోకి ప్రవాహంలా వచ్చిపడుతున్న చైనా వస్తువులు భారత వ్యాపారుల, వస్తూత్పత్తిదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. చైనా నుంచి మన మార్కెట్‌లోకి వచ్చేవి కేవలం చిరు ఉత్పత్తులే కాదు. భారీ యంత్రాల దిగుమతుల కూడా ఉంటున్నాయి. ఈ అంశాలపై కూడా దృష్టి సారించాల్సి ఉంది.
భారత్ వైపు డ్రాగన్ చూపు
మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య యుద్ధం, ఆర్థిక మాంద్యం మూలంగా చైనా ఆర్థికాభివృద్ధి రేటు కూడా దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత్‌తో వాణిజ్యం చైనాకు కూడా కీలకం. అందుకే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నా వాణిజ్యం విషయంలో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తోంది డ్రాగన్ దేశం. భారత్ సైతం ఈ వాణిజ్య అవసరాలు దృష్టిలో ఉంచుకొని రాజకీ య, సైనిక వివాదాలు పరిష్కరించుకునేందుకు కృషి జరగాలని అంటున్నారు విశ్లేషకులు. జనాభా పరంగా చూస్తే ఇరుదేశాలు కలిపి 270కోట్లు వరకూ ఉండగా ప్రపంచ జీడీపీలో 20% ఈ రెండు దేశాలదే కావడం వల్ల ఆర్థిక, వాణిజ్యపరమైన సహకారాన్ని పెంపొందించుకునేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడికి జెడ్ కేటగిరి భద్రత