తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఈ ఏడాది 7 నెలల పాటు చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదం వల్ల భారత్ పరీక్షను ఎదుర్కొందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఫిక్కీ వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. సరిహద్దు వివాదం వల్ల భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందున ఈ అంశం చైనా ప్రయోజనాలకు మేలు చేయదని అన్నారు. ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో ఊహించలేనని తెలిపారు. పరస్పర సంబంధాల బలోపేతానికి భారత్, చైనా చాలా కృషి చేశాయని పేర్కొన్నారు. సరిహద్దు వివాదం వల్ల చైనా ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. జాతీయ భద్రతకు ఎదురయ్యే సవాల్‌ను భారత్ ఎదుర్కొంటుందని జైశంకర్ స్పష్టం చేశారు.
''వాస్తవాధీన రేఖ వద్ద ఈ ఏడాది జరిగిన సంఘటనలు చాలా ఇబ్బంది కల్గించేవిగా ఉన్నాయి. అవి కొన్ని ఆందోళనలను రేకెత్తించాయి. వాస్తవాధీన రేఖను గౌరవించడం, పరిరక్షించడం, అక్కడ సైన్యాన్ని మోహరించరాదని ఉన్న ఒప్పందాలను అవతలి పక్షం(చైనా) ఉల్లంఘించడం వల్ల ఈ సమస్యలు తలెత్తాయి. ఎల్‌ఏసీ వద్ద జరిగింది చైనా ప్రయోజనాలకు మేలు చేయదు. పరస్పర సంబంధాల బలోపేతం కోసం భారత్, చైనా చాలా కృషి చేశాయి. ఈ ఏడాది జరిగిన సంఘటనలు సంబంధాల బలోపేతానికి మేలు చేశాయని నేను భావించడం లేదు. సంబంధాల బలోపేతం విషయంలో చైనా చాలా జాగ్రత్తగా సంపాదించుకున్న ప్రతిష్ట దీని వల్ల దెబ్బతింటుంది.''
-జైశంకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి