దిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం సిబ్బందిలో 50 శాతం తగ్గించాలని ఆ దేశాన్ని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) నిర్దేశించింది. ఈ మేరకు దిల్లీలోని పాక్ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసి తమ నిర్ణయాన్ని తెలిపింది.
హైకమిషనర్ కార్యాలయంలో సిబ్బంది తగ్గింపు నిర్ణయాన్ని వారం రోజుల్లో అమలు చేయాలని పాకిస్థాన్ రాయబారికి స్పష్టం చేసింది భారత్. ప్రస్తుతం పాక్ హైకమిషన్‌లో 110 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిని 55కు కుదించాలని ఈ సమన్లలో పేర్కొంది.
అంతే మొత్తంలో పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంలోనూ ఉద్యోగులను తగ్గించనున్నట్లు పాక్ దౌత్యవేత్తకు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
గూఢచర్యం నేపథ్యంలో..
దిల్లీలోని పాక్ హైకమిషన్‌లోని ఉద్యోగులు గూఢచర్యానికి పాల్పడటం సహా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగించటంపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గతనెల 31న ఇద్దరు పాకిస్థాన్ రాయబార కార్యాలయం సిబ్బంది గూఢచర్యానికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన విషయాన్ని ఉదహరించింది.
సిబ్బంది వేధింపులపైనా..
ఇస్లామాబాద్‌లో తమ రాయబార కార్యాలయం ఉద్యోగులను తరచూ వేధింపులకు గురిచేస్తున్నారని కూడా ఎంఈఏ ఆరోపించింది. ఇటీవల దిల్లీకి తిరిగి వచ్చిన బాధితులు ఆ విషయాన్ని తమ దృష్టికి తెచ్చినట్లు పాక్ దౌత్యవేత్తకు తెలిపింది.
వీరిని అపహరించి గంటలపాటు చిత్రహింసలు పెట్టారని పేర్కొంది. దౌత్య అధికారులతో వ్యవహరించే తీరులో వియన్నా ఒప్పందంతోపాటు ద్వైపాక్షిక ఒడంబడికలనూ ఉల్లఘించారని మండిపడింది. దీనికి మించి సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ హింసకు కారణమవుతున్నారని పేర్కొంది.
రెండోసారి..
పాక్ హైకమిషన్ ఉద్యోగులను తగ్గించుకోవాలని భారత్ కోరడం ఇది రెండోసారి. 2001 పార్లమెంటుపై దాడి జరిగిన తర్వాత పాక్ రాయబార కార్యాలయ సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించింది.
దాడి తర్వాత పాక్ అధికారుల పాత్రపై ఆధారాలతో సహా బయటపెట్టి అప్పటి విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు.