వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి పునరుద్ధరణకు భారత్, చైనా అంగీకారానికి వచ్చాయి. సరిహద్దుల్లో బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరు దేశాల మధ్య శుక్రవారం జరిగిన దౌత్య స్థాయి చర్చల్లో నిర్ణయించారు. సరిహద్దు సమస్యలపై పరస్పర సమాచారం, సహకారంపై ఇరు దేశాలు 16వ సారి భేటీ అయినట్లు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) పేర్కొంది.
ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ భేటీలో భారత్ తరఫున ఎంఈఏ తూర్పు ఆసియా సంయుక్త కార్యదర్శి, చైనా నుంచి సరిహద్దు, సముద్రాల శాఖ డైరెక్టర్ జనరల్ పాల్గొన్నారు.
"ఈ భేటీలో బలగాల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిపై చర్చించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, నిబంధనలకు అనుగుణంగా బలగాలను పూర్తి స్థాయిలో వెనక్కి పిలవాలని ఈ భేటీలో ఇరు పక్షాలు అంగీకరించాయి. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం పునఃస్థాపనకు కృషి చేయాలని నిర్ణయించాయి."
- భారత విదేశాంగ శాఖ ప్రకటన
కొన్ని రోజులుగా భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ రెండు దేశాలు బలగాలను వెనక్కు పంపిస్తున్నాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య పలుసార్లు జరిగిన దౌత్య, సైనిక స్థాయి చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే భారత్- చైనా సీనియర్ ఆర్మీ కమాండర్లు భేటీ అయి పూర్తి స్థాయి సైనిక ఉపసంహరణపై చర్చిస్తారని స్పష్టం చేసింది ఎంఈఏ.