దిల్లీ వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సొనారో మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడి, చమురు, సైబర్ భద్రత, ఐటీ రంగాల్లో భారత్- బ్రెజిల్ మైత్రి బలపడే దిశగా అగ్రనేతల మధ్య 15 ఒప్పందాలు జరిగాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని... ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత పెంపొందించేందుకు ఓ కార్యచరణ సిద్ధమైనట్టు వెల్లడించారు. బోల్సొనారో రాక.. భారత్, బ్రెజిల్ ద్వైపాక్షిక బంధానికి కొత్త అధ్యాయమని పేర్కొన్నారు.
"దృఢమైన మైత్రికి ప్రతీక భారత్- బ్రెజిల్. అందుకే భౌగోళికంగా ఎంతో దూరంగా ఉన్నప్పటికీ... ప్రపంచంలోని అనేక అంశాల్లో కలిసే ఉన్నాం. వికాశాన్ని పెంపొందించేందుకు బ్రెజిల్ విలువైన భాగస్వామి. అందువల్లే ఇరు దేశాల మధ్య మైత్రిని అన్ని రంగాల్లోనూ బలోపేతం చేసే విధంగా నేను- బోల్సొనారో చర్చలు జరిపాం. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఓ కార్యచరణను సిద్ధం చేశాం. 2023లో భారత్-బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 70 సంవత్సరాలు నిండుతాయి. అప్పటివరకు ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రి, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య సహకారాలను ఈ కార్యచరణ మరింత బలపరుస్తుందని నేను విశ్వసిస్తున్నా."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
అంతకుముందు దిల్లీలోని రాజ్భవన్లో బోల్సొనారోకు అధికార లాంఛనాలతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బోల్సొనారో శుక్రవారం దిల్లీ చేరుకున్నారు. కూతురు లారా బోల్సొనారో, కోడలు లెటీసియా ఫిర్మీతో పాటు ఎనిమిది మంది మంత్రుల బృందంతో భారత్కు విచ్చేసిన జాయిర్ బోల్సొనారో.. రేపు నిర్వహించే 71వ గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.