కరోనా స్పందనలో భాగంగా భారత్.. ప్రపంచ ఫార్మసీగా వ్యవహరించిందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి దాదాపు అన్ని దేశాలకు వైద్య ఉత్పత్తులను సరఫరా చేసినట్లు తెలిపింది.
ఈ మేరకు 'కొవిడ్ తదనంతర పరిస్థితుల్లో ప్రవాసులతో ఆర్థిక సమన్వయం పెంపొందించడమ'నే అంశంపై విదేశీ వ్యవహారాల కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు మధ్య వారధిగా వ్యవహరించే సత్తా భారత్కు ఉన్నట్లు తెలిపారు. యోగా, ఆయుర్వేదంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని అన్నారు. దౌత్యపరంగా ఇతర దేశాలతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు.
"ఇతర దేశాల్లోని ప్రతినిధులతో ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రులు పరస్పరం చర్చలు జరుపుతున్నారు. కరోనా పోరులో అనుభవాలను పంచుకోవడం సహా కొవిడ్-19 తదనంతర పరిణామాలపైనా సానుకూల వైఖరితో ఉన్నారు. సార్క్, బ్రిక్స్, జీ20, ఐరాస సంస్థల వంటి ప్రాంతీయ, బహుళపాక్షిక కూటములకు కొత్త వేగాన్ని అందించాలనుకుంటున్నాం. విదేశాంగ శాఖ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించింది. త్వరలో శిఖరాగ్ర సదస్సు ఏర్పాటు చేయబోతున్నాం."
-సంజయ్ భట్టాచార్య, విదేశీ వ్యవహారాల కార్యదర్శి (ప్రవాస భారతీయ వ్యవహారాలు, కాన్సులర్ పాస్పోర్ట్ వీసాలు)
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకురావడంలో ప్రపంచదేశాలతో ఉన్న సమన్వయం ఉపయోగపడిందని పేర్కొన్నారు భట్టాచార్య. కొవిడ్ కట్టడిలో భారత్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని అన్నారు. ఇలాంటి భారీ సంక్షోభం వచ్చినా కార్యకలాపాలు నిర్వహించే సత్తా ఉందని భారత్లోని ఈ-కామర్స్, ఐటీ పరిశ్రమలు నిరూపించాయని వ్యాఖ్యానించారు.
కొవిడ్-19 సంక్షోభం తర్వాత కూడా భారత్ వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘ కాలంలో వృద్ధి పుంచుకుంటుందని అంచనా వేశారు.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 23 లక్షల మంది క్వారంటైన్లో