దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ దిల్లీలోని ఎర్రకోటపై జెండా వందనం చేయగా... కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ఇంటి వద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు.
దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా.. జెండా వందనం చేశారు. మోదీ నేతృత్వంలో పని చేసి దేశాభివృద్ధికి పాటు పడటం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో...
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిల్లీలోని పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రాహుల్ గాంధీ నుంచి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి.. సీనియర్ నేతలు, కార్యకర్తలతో కలిసి సోనియా స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.
వివిధ రాష్ట్రాల్లో...
కట‌్టుదిట్టమైన భద్రత మధ్య పంజాబ్-హరియాణా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో స్వాతంత్ర్య వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్.. చండీగఢ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా... ఫరిదాబాద్‌లో హరియాణా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ జెండా ఎగురవేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ జలంధర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్య వీరుల పోరాటాలను గుర్తుచేసుకున్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురంలో జాతీయ జెండా ఎగరవేశారు.