కరోనా వైరస్‌ను లెక్కచేయకుండా, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల గురించి కేంద్రం పార్లమెంట్‌లో ప్రస్తావించకపోవడం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)కు ఆగ్రహం తెప్పించింది. ఈ అంశం రాష్ట్రాల పరిధిలోనిది కాబట్టి తమ వద్ద సమాచారం లేదని చెప్పడం కూడా ఆ కోపానికి కారణమైంది. మృతుల పట్ల ప్రభుత్వ ఉదాసీనతను నిందించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అంటువ్యాధుల చట్టం(1897), విపత్తుల నిర్వహణ చట్టాన్ని నిర్వహించే నైతికతను కోల్పోతుందని మండిపడింది. అంతేకాకుండా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల జాబితాను ప్రచురిస్తూ..వారికి అమరులుగా పరిగణించాలని తన ప్రకటనలో డిమాండ్ చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే పార్లమెంట్‌లో ప్రకటన చేస్తూ..ప్రజారోగ్యం, ఆసుపత్రులు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, అందువల్ల బీమా పరిహారానికి సంబంధించిన సమాచారం కేంద్రం వద్ద లేదని వెల్లడించారు. దాంతో ఆగ్రహానికి గురైన ఐఎంఏ..ప్రజల కోసం వైరస్‌కు ఎదురొడ్డి నిలబడిన జాతీయ వీరులను ప్రభుత్వం వదిలేసిందని విమర్శించింది. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 382మంది వైద్యులు మరణించగా..అందులో 27 నుంచి 85 సంవత్సరాల వయస్సున్న వైద్యులు ఉన్నారని తెలిపింది. ఈ వివరాలను కేంద్రం వెల్లడించకపోవడం బాధాకరమని, భారత్ వలే ఏ దేశమూ ఇంతమంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలను కోల్పోలేదని ఆ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో సహా దేశ వ్యాప్తంగా ఉన్న 22.12లక్షల మంది వైద్య సిబ్బందికి జాతీయ పథకం కింద కేంద్రం రూ.50లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందని మార్చిలో ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.
మరోవైపు, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన దగ్గరి నుంచి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు తమ వద్ద సమాచారం లేదని చెప్పి కేంద్రం విమర్శలకు గురికావడం ఇది రెండోసారి. లాక్‌డౌన్ కారణంగా ఎంతమంది వలసకార్మికులు ప్రాణాలు కోల్పోయారని అడిగిన ప్రశ్నకు కూడా సంబంధిత మంత్రిత్వ శాఖ తమ వద్ద సమాచారం అందుబాటులో లేదని చెప్పిన సంగతి తెలిసిందే.