తమిళనాడు రాజధాని చెన్నైకి వరద ముప్పు తప్పించేందుకు ఐఐటీ - మద్రాసు ప్రణాళిక రూపొందించింది. ఈ నగరానికి అడయార్, కూవమ్, ఎన్నోర్ నదుల ద్వారా వరదలు వస్తుంటాయి. భారీ వర్షాలు వచ్చినప్పుడు వీటి ద్వారా సముద్రం నీరు వెనక్కి తన్ని నగరంలోకి ప్రవేశిస్తుంది. దీన్ని నివారించడానికి ఎన్నోర్ నది సముద్రంలో కలిసే చోట పెద్ద రక్షణ గోడ నిర్మించాలని ఆ సంస్థ నిపుణులు ప్రతిపాదించారు. నది ముఖద్వారం వద్ద పూడిక తీయాల్సి ఉంటుందని కూడా సూచించారు.
గోడ నిర్మాణంతో పాటు, తరచుగా పూడిక తీయడం ద్వారా ఉత్తర చెన్నై నగరాన్ని వరదల నుంచి కాపాడవచ్చని తెలిపారు. గతంలో ఇలాంటి గోడలు నిర్మించినప్పుడు నీరు నిలిచిపోయి మరిన్ని ఇబ్బందులు ఎదురయిన సంఘటనలను పరిగణనలోకి తీసుకొని వాటికి పరిష్కార మార్గాలు కూడా చూపించారు.
కోసతలైయార్ నదీ తీరంలో వరదలను నియంత్రణకు పరిష్కార మార్గాలను సూచించే విధంగా కామరాజర్ కోట అధికారులు ఈ పరిశోధనకు ఏర్పాట్లు చేశారు. ఐఐటీ మద్రాస్.. సముద్ర ఇంజినీరింగ్ విభాగ ప్రొఫెసర్లు కే మురళి, ఎస్ఏ సన్నాసిరాజ్, ప్రొఫెసర్ వీ సుందర్‌లు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. నదిలో వరదలతో పాటు తీవ్రమైన తుపాను పరిస్థితులు, అధిక ఆటుపోట్ల స్థాయిలపై ఈ అధ్యయనం ప్రధానంగా దృష్టి సారించింది.
ఇదీ చదవండి: భాగ్యనగరానికి బుల్లెట్ రైలు- కేంద్రం ప్రణాళిక