వ్యవసాయ వ్యర్థాల నుంచి అధిక శక్తిగల బయో ఇంధనాన్ని వెలికితీసే మైక్రోవేవ్ పద్ధతిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. గడ్డి, చెరకు పిప్పి సహా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఇంధనం తయారీ చేసే ప్రక్రియను రూపొందించారు.
కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఆర్ విను నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ విధానాన్ని ఆవిష్కరించింది. వీరి పరిశోధన సారాంశం ప్రఖ్యాత 'బయో రిసోర్స్ టెక్నాలజీ', 'ఫ్యూయెల్ ప్రాసెసింగ్ టెక్నాలజీ' జర్నల్లలో ప్రచురితమైంది.
"పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడకుండా రసాయనాలు, ఇంధనం ఉత్పత్తి చేయగలిగే శక్తి కలిగిన పునరుత్పాదక కర్బన వనరు బయోమాస్ మాత్రమే. చెరకు పిప్పి, కలప, గడ్డి వంటి వ్యవసాయ ఉత్పత్తులు బయో ఇంధనం ఉత్పత్తి చేయడానికి జీవపదార్థాలుగా ఉపయోగపడతాయి."
-డా.ఆర్ విను, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్
సాధారణంగా పైరొలైసిస్(అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి కుళ్లిపోయేలా చేయడం) అనే విధానం ద్వారా బయోమాస్‌ను ఇంధనంగా మార్చుతారు. అయితే.. శిలాజ ఇంధనంతో పోలిస్తే ఇందులో అధిక స్థాయిలో ఆక్సిజనేట్లు ఉంటాయి. ఈ ఆక్సిజనేట్లు తక్కువ వేడిని ఉత్పత్తి చేయడమే కాకుండా అధిక లవణం, తుప్పును ఉత్పన్నం చేస్తాయి. బయో ఆయిల్‌ను శిలాజ ఇంధనంతో పోలిస్తే మరింత మెరుగ్గా మార్చాలంటే అందులో ఆక్సిజనేట్ల స్థాయిని తగ్గించి, హైడ్రోజన్ స్థాయిని పెంచాల్సి ఉంటుంది.
హైడ్రోజన్ తగ్గించేందుకు
ఇందుకోసం హైడ్రోజన్ ఎక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ను బయోమాస్ ఉత్పత్తిలో వినియోగిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రొఫెసర్ విను వెల్లడించారు. ఈ ప్లాస్టిక్.. బయో ఆయిల్‌కు హైడ్రోజన్‌ను సరఫరా చేసి ఆక్సిజనేట్లను తగ్గించడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
బయోమాస్, ప్లాస్టిక్‌ను కలిపి పైరొలైసిస్ చేయడం ద్వారా ఇంధన కేలొరిఫిక్ విలువ పెరగడమే కాకుండా కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఫలితంగా ఈ ప్రక్రియ సామర్థ్యం మెరుగుపడి ఇంధన దిగుబడి పెరుగుతుంది. ప్లాస్టిక్ లేకుండా కేవలం బయోమాస్ ద్వారా తయారు చేసే ఇంధనంతో పోలిస్తే ఈ ఇంధనం అధిక శక్తిని విడుదల చేస్తుంది.
మైక్రోవేవ్ ద్వారా
ఈ మేరకు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు మరో అడుగు ముందుకేసి.. మైక్రోవేవ్ ద్వారా బయోమాస్, ప్లాస్టిక్‌లతో కో-పైరొలైసిస్ ప్రక్రియ చేపట్టారు. వ్యవసాయ వ్యర్థాలతో పాలిప్రాపలీన్, పాలిస్టరీన్ ప్లాస్టిక్‌ను కలిపి మైక్రోవేవ్ ద్వారా ఈ ప్రక్రియను నిర్వహించారు.
మరోవైపు బయో ఆయిల్ నాణ్యతను మరింత పెంచడానికి జియోలైట్ అనే ఉత్ప్రేరకాన్ని ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ఉత్ప్రేరకం ద్వారా బయో-ఆయిల్ మంచి లక్షణాలు కనబర్చినట్లు పేర్కొన్నారు. వనరుల పునరుద్ధరణ కోసం 'మైక్రోవేవ్ పైరొలైసిస్' ప్రక్రియ ఓ శక్తిమంతమైన విధానమని ప్రొఫెసర్ విను అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: టీఎంసీలో అసమ్మతి సెగ- భాజపాకు లాభించేనా?