మహమ్మారి కరోనా వ్యాప్తిని అరికట్టాలన్నా.. కొవిడ్ నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాలన్నా మాస్క్ విధిగా ధరించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అధికారుల ఆదేశాలతో ఎక్కువశాతం మంది మాస్క్‌లు ధరిస్తున్నారు. అయితే నిర్దిష్ట సమయం వినియోగం తర్వాత.. వాటిని చెత్తబుట్టల్లో పడేస్తున్నారు. ఇలా వాడిపడేస్తున్న మాస్కుల సంఖ్య రోజూ లక్షల్లో ఉంటోంది. వాటి ద్వారా వైరస్ వ్యాప్తి జరిగేందుకు ఎక్కువ ఆస్కారముంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ అన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అంకుర సంస్థ 'అంతరిక్ష్ వేస్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్'.. వినూత్న ఆలోచన చేసింది. ఆసుపత్రులు, క్లినిక్‌లు, జనావాస ప్రాంతాలు, క్వారంటైన్ జోన్లలో వ్యర్థపదార్థాల ద్వారా కరోనా నివారణకు 'స్మార్ట్ బిన్ సిస్టమ్'ను అభివృద్ధి చేసింది.
మొబైల్ యాప్‌తో అలర్ట్‌లు
'ఎయిర్‌బిన్'గా పిలిచే ఈ వ్యవస్థను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) పరిజ్ఞానంతో రూపొందించారు. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో చెత్త ఏ మేరకు ఉందనే విషయాన్ని స్మార్ట్‌ఫోన్‌తో తెలుసుకోవచ్చు. స్తంభాలు, గోడల దగ్గరున్న డస్ట్ బిన్ మూతలపై దీనిని అమర్చి రిమోట్ ద్వారా పర్యవేక్షించొచ్చు. చెత్త డబ్బాల్లో ఉన్న వ్యర్థ పదార్థాల స్థాయిని బట్టి మొబైల్ యాప్ ద్వారా వాటిని త్వరగా ఖాళీ చేయాలని శానిటైజేషన్ సిబ్బందికి ఎయిర్‌బిన్ హెచ్చరికలు పంపుతుందని రూపకర్తలు చెబుతున్నారు.
" మరో ఐదు నెలల్లో ఎయిర్‌బిన్ మార్కెట్లోకి విడుదలవుతుంది. రానున్న కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా 200 ఎయిర్బిన్లను సరఫరా చేస్తాం. భవిష్యత్‌లో మొత్తం 200 స్మార్ట్‌సిటీలకు లక్ష పరికారలను డెలివరీ చేస్తాం.
దేశవ్యాప్తంగా ఉత్పన్నమయ్యే వ్యర్థపదార్థాలు ప్రతి ఐదేళ్లకోసారి రెండింతలు అవుతున్నాయి. వ్యర్థాల సేకరణ, రవాణా, వేరుచేయడం, పారవేయడం నుండి రీసైక్లింగ్ వరకు, ప్రతి ప్రక్రియ వేగంగా జరగాల్సిన అవసరముంది. ఇందులో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తుంది. కార్మికుల కొరత ఉన్నప్పుడు చెత్త డబ్బాలను సకాలంలో శుభ్రపరచడం ప్రథమ ప్రాధాన్యం అవుతుంది. గ్రామీణ, పట్టణ సిబ్బంది స్థానికంగా ఉండే డస్ట్బిన్లు నిండిపోయే ముందే వాటిని ఖాళీ చేయించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఏ ప్రాంతంలోనైనా అంటువ్యాధి వ్యాప్తి నియంత్రణలో వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రక్రియలు కీలకపాత్ర పోషిస్తాయి. "
- మహేక్ మహేంద్ర షా, ఐఐటీ పట్టభద్రుడు
ఎలా వినియోగించాలంటే..
1. ఎయిర్‌బిన్ పరికరంలో బ్యాటరీ అమర్చాలి
2. ఆ తర్వాత ఎయిర్బిన్కు విద్యుత్ సరఫరా అయ్యేలా చూసుకుని సెన్సార్‌ను యాక్టివేట్ చేయాలి
3. పరికరాన్ని డస్ట్‌బిన్‌పై అమర్చాలి