కరోనాను దరిచేరకుండా రక్షించే ఓ పరికరాన్ని ఐఐటీ- కాన్పుర్, లఖ్‌నవూలోని సంజయ్ గాంధీ పీజీఐ సంయుక్తంగా కనిపెట్టాయి. కరోనా వైరస్‌ను ఊపిరితిత్తుల్లోకి పోనియకుండా కట్టడి చేసే 'పాజిటివ్ ప్రెజర్ రెస్పిరేటర్ సిస్టమ్' పరికరం నమూనాను రూపొందించాయి.
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ను నియంత్రించాలంటే దాని సంక్రమణను ఆపటం చాలా ముఖ్యం. ఇందుకోసం ఐఐటీ- కాన్పుర్, సంజయ్ గాంధీ పీజీఐ కొన్ని రోజులుగా కలిసి కృషి చేస్తున్నాయి. వైరస్‌ను శరీరంలోకి వెళ్లనీయకుండా నియంత్రించే రెస్పిరేటరీ సిస్టమ్ పరికరాన్ని నిర్మించాయి.
ఎన్-95 మాస్కులకన్నా..
ఈ పరికరంతో కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి.. వైరస్ సంక్రమించకుండా రక్షించవచ్చు. ఈ పరికరం ఎన్-95 మాస్కులకన్నా మెరుగ్గా పని చేస్తుందని ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్ డాక్టర్ నచికేత అంటున్నారు. ఇది శ్వాసక్రియ ద్వారా వైరస్ ఊపిరితిత్తులలోకి వైరస్ వచ్చే అవకాశాన్ని నివారిస్తుందని పేర్కొన్నారు.
వీరు రూపొందించిన పరికరానికి 2 కవాటాలు ఉంటాయి. ఒకదాని నుంచి వచ్చే గాలి శరీరంలోకి వెళుతుంది. మరొక దాని నుంచి విడుదలయ్యే గాలి బయటకు వస్తుంది. దీని కోసం ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్ లేదా గాలి సీసాలు ఉపయోగించవచ్చని నచికేత తెలిపారు. స్థానికంగా తయారు చేయటం, దేశీయ పరికరాలు ఉపయోగించటం వల్ల ధర కూడా తక్కువగానే ఉంటుందని ఆయన అన్నారు.
ఇదీ చూడండి: 80 ఆస్పత్రులు తిరిగినా ఆ రోగికి నో ఎంట్రీ!