గాలిలో నుంచి నీటిని తయారుచేసే సమర్థవంతమైన పద్ధతిని ఐఐటీ గువాహటి పరిశోధకులు రూపొందించారు. తేమ ఉండే గాలిలో నుంచి కీటకాలు, మొక్కలు నీటిని పీల్చుకొనే విధానాన్ని ఆసరాగా చేసుకొని కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. వీరి పరిశోధన ప్రముఖ అంతర్జాతీయ 'జర్నల్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో ప్రచురితమైంది.
నీటిని సంరక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయేతర పద్ధతులను ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐఐటీ గువాహటి సెంటర్ ఆఫ్ నానోటెక్నాలజీ అసోసియేటెడ్ ప్రొఫెసర్ ఉత్తమ్ మన్నా పేర్కొన్నారు. నీటిని తయారు చేసేందుకు ప్రకృతిపైనే శాస్త్రవేత్తలు దృష్టిసారిస్తున్నారని చెప్పారు.
"తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో గాలిలో నుంచి నీటిని పీల్చుకొనేందుకు మొక్కలు, కీటకాలకు ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. దీన్ని అనుకరిస్తూ గాలి నుంచి నీటిని తయారు చేసేలా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు."
-ఉత్తమ్ మన్నా, ఐఐటీ గువాహటి అసోసియేటెడ్ ప్రొఫెసర్.
ఇలాంటి విధానాలను హైడ్రోఫోబిసిటీగా పిలుస్తారని మన్నా పేర్కొన్నారు. తాజా పరిశోధనలో.. నీటిని సమర్థంగా ఒడిసిపట్టేందుకు 'స్లిప్స్' అనే రసాయన నమూనాను తొలిసారి ఉపయోగించినట్లు తెలిపారు.
"తామరాకును బట్టి మనం హైడ్రోఫోబిసిటీని అర్థం చేసుకోవచ్చు. తామర ఆకుపై నీరు నిలవదు. ఎందుకంటే ఆకు ఉపరితలానికి, నీటి బిందువుకు మధ్య సన్నని గాలిపొర ఉంటుంది. కాబట్టి నీటి బిందువులు ఆకుపై నిలవకుండా పడిపోతాయి. నీటిని పీల్చుకొనే విధంగా సమర్థవంతమైన ఇంటర్ఫేస్ను తయారుచేశాం. దీనికి పొగమంచును పీల్చుకొనే గుణం అధికంగా ఉంటుంది. పరిశోధకులు దీని సమర్థతను పరీక్షించి చూశారు. నీటిని ఒడిసిపట్టే విషయంలో చాలా ఉత్తమంగా పనిచేస్తుందని తేలింది."
-ఉత్తమ్ మన్నా, ఐఐటీ గువాహటి అసోసియేటెడ్ ప్రొఫెసర్.
భారత్లో 50శాతం మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు లభించడం లేదని మన్నా తెలిపారు. ఫలితంగా ఏటా రెండు లక్షల మంది మరణిస్తున్నారని వెల్లడించారు. పరిశోధకులు అభివృద్ధి చేసిన చౌకైన ఈ విధానం ద్వారా ఆవిరి, పొగమంచు నుంచి నీటిని సులభంగా తయారుచేయవచ్చని చెప్పారు. వీటిని ఉపయోగించి దేశంలో నీటి కొరత సమస్యను కొంతవరకు అధిగమించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: యూఏఈ, సౌదీ పర్యటనకు నరవాణే