కరోనాపై పోరుకు తమదైన ప్రతిభతో ముందుకొచ్చారు ఐఐటీ దిల్లీ విద్యార్థులు. ఇప్పటికే ఆయా సంస్థల్లోని విద్యార్థులు వెంటిలేటర్లు, ఆరోగ్య పరికరాల తయారీలో శ్రమిస్తుంటే.. వీళ్లు సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి వరకు నిత్యావసరంగా మారిన మాస్క్‌లపై దృష్టిపెట్టారు. అతి తక్కువ ధరలో ఎన్-95 కంటే అద్భుతంగా పనిచేసే ముసుగును తయారుచేశారు. దీన్ని జూన్ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నట్లు ఈటీవీ భారత్‌కు చెప్పాడు తయారీలో భాగస్వామి అయిన హర్ష్లాల్.
"కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో చాలా మంది ప్రజలకు నాణ్యమైన మాస్క్‌లు దొరకట్లేదు. వాళ్లు ధరించినవి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడలేవు. ఎన్-95 వంటి మాస్క్‌లు అందుబాటులో ఉన్నా ధర ఎక్కువగా ఉన్నాయి. సరఫరా కూడా సరిగా లేదు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోని ప్రజలు మాస్క్‌ల ధర ఎక్కువగా ఉండటం వల్ల.. టవళ్లు, రుమాళ్లు, చిన్న వస్త్రం ముక్కలు కట్టుకుంటున్నారు. అలాంటి వారి కోసమే అతితక్కువ ధరకు నాణ్యమైన మాస్క్‌లు తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. మేము తయారుచేసిన ఈ మాస్క్ ఎన్ 95 కంటే బాగా పనిచేస్తుంది. ప్రత్యేకమైన వస్తంతో రూపొందించాం. ఇది ఫంగల్, బాక్టీరియాను దరి చేరనీయదు"
-- హర్ష్లాల్, ఐఐటీ దిల్లీ విద్యార్థి
రూ.27 ఉన్న ఈ మాస్క్‌ను జూన్ 1 నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశాడు హర్ష్లాల్. దాదాపు దేశవ్యాప్తంగా ప్రజలకు అందించాలని ఆశయంతో ఉన్నట్లు పేర్కొన్నాడు.