మీ ఇంట్లో వాడే వంట నూనెను డీజిల్‌గా మార్చుకోవచ్చు అంటే నమ్మగలరా... అవును.. దీనిని నిజం చేశారు ఉత్తరాఖండ్ దేహ్రాదూన్‌లోని ఓ పరిశోధకుడు. వంట నూనె నుంచి డీజిల్‌ను ఉత్పత్తి చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియమ్(ఐఐపీ) సంస్థ ప్రధాన శాస్త్రవేత్త నీరజ్ ఈ ఆవిష్కరణకు పూనుకున్నారు.
సాంకేతికతను జోడించి ఇన్స్టిట్యూట్ మెస్‌లో మిగిలిపోయిన వంటనూనె వ్యర్థాలను సేకరించి వాటి నుంచి డీజిల్‌ను ఉత్పత్తి చేశారు నీరజ్. ప్రస్తుతం ఐఐపీలో దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇది విజయవంతమైతే... దేహ్రాదూన్‌లో మొదటి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2020 మార్చి నుంచి ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రక్రియ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
''భారతదేశంలో 20 నుండి 25 మిలియన్ టన్నుల వంట నూనెను ఉపయోగిస్తున్నారు. ఇందులో 5 శాతం వంట నూనెను డీజిల్‌గా మార్చడానికి ఉపయోగిస్తే, ముడి చమురు దిగుమతిలో ఎక్కువ భాగాన్ని తగ్గించవచ్చు. 8 సంవత్సరాల నుంచి దీనిపై పరిశోధన చేస్తున్నాం. 2015లో పేటెంట్ రైట్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. 2018లో మంజూరైంది. మొదటి ప్లాంట్ రాయ్‌పూర్‌లో ఏర్పాటు చేస్తాం. ఇండియన్ ఆర్మీ, నేవీలో వీటికి మంచి డిమాండ్ ఉంది.''
-నీరజ్, పరిశోధకుడు, ఐఐపీ శాస్త్రవేత్త
డీజిల్ ఎలా తయారు చేస్తారంటే..
సేకరించిన వంటనూనె నుంచి వ్యర్థాలను వేరు చేస్తారు. ఆపై మిథనాల్ ద్రావకాన్ని సోడా(సోడియం కార్బోనేట్) ఉత్ప్రేరకంతో కలుపుతారు. ఆ రెండింటి మిశ్రమాలను వేరు చేసిన వంటనూనెతో జత చేస్తారు. అప్పుడు నూనె, మిథనాల్ మిశ్రమం రెండు పొరలుగా విడిపోతుంది. ఈ మొత్తం మిశ్రమాన్ని 65 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 3 నుంచి 4 గంటల పాటు వేడి చేస్తారు. ఐఐపీ తయారు చేసిన పేటెంట్ మిశ్రమాన్ని ఇందులో ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పాటు కలుపుతారు.
అలా రసాయన చర్యలు జరిగి బయో డీజిల్, గ్లిసరాల్ రెండూ 15 నిమిషాల్లో వేరవుతాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది. బయో డీజిల్ పై భాగానికి, గ్లిసరాల్ అడుగుకు చేరుతుంది. ఇందులో ఉన్న గ్లిసరాల్ మిశ్రమాన్ని మరింత మెరుగుపరిచి సబ్బు ఇతర సంబంధిత పరిశ్రమలలో ఉపయోగించేందుకు పంపిస్తారు. ఇక డీజిల్‌ను నేరుగా ఉపయోగించుకోవచ్చు. దీనిని సాధారణంగా వాహనాల్లో వాడే ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు.
ఇదీ చూడండి: 'సమాజంపై పగ' పేరుతో పిల్లలపై రసాయన దాడి