సౌకర్యవంతమైన రహదారులు కావాలంటే తప్పనిసరిగా టోల్ పన్నులు చెల్లించాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. కేంద్రం వద్ద తగిన నిధులు లేనంతకాలం టోల్ వ్యవస్థను కొనసాగిస్తామని, అయితే రేట్లలో మార్పులు ఉండొచ్చని తెలిపారు. రోడ్డు రవాణా, రహదారుల నిర్మాణాలకు నిధుల కేటాయింపుపై లోక్సభలో చర్చ సందర్భంగా గడ్కరీ టోల్ పన్ను రద్దు కుదరదని స్పష్టం చేశారు.
గత ఐదేళ్ల కాలంలో ఎన్డీఏ సర్కారు 40 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించినట్లు వెల్లడించారు. ఈ మార్గాల్లో వసూలు చేసిన టోల్ పన్ను మొత్తాన్ని గ్రామీణ కొండ ప్రాంతాల్లో రహదారులు, భవనాల నిర్మాణానికి వినియోగిస్తున్నామని తెలిపారు. టోల్ పన్నుకు ముగింపు ఉండదని స్పష్టం చేశారు.
"12 గంటలు పట్టే ప్రయాణానికి 2 గంటలు పడుతుంటే మీకు ఇంధనం, సమయం మిగులుతుంది కదా. అప్పుడు ఆ డబ్బును టోల్ రూపంలో చెల్లించండి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనంతకాలం మంచి సేవలు, రహదారులు కావాలంటే టోల్ చెల్లించాల్సిందే."
-నితిన్ గడ్కరీ, కేంద్ర రవాణా మంత్రి
గడ్కరీ ప్రసంగంలో ఇతర అంశాలు
- దిల్లీ- ముంబయి గ్రీన్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ప్రతిపాదనలు పరిశీలిస్తున్నాం.
- భూసేకరణ సమస్యతో రహదారుల నిర్మాణానికి ఆటంకం కలుగుతోంది.
- 80 శాతం భూసేకరణ జరగని ప్రాజెక్టులను నిలిపివేశాం.
- ఇదే కారణంతో బంగాల్, బిహార్లో ప్రాజెక్టులు నెమ్మదిగా సాగుతున్నాయి.
- పాఠశాల బస్సులు, రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులకు టోల్ మినహాయింపు కల్పించే అంశాన్ని పరిశీలిస్తాం.
ఇదీ చూడండి: సభలో హాజరుపై మంత్రులకు మోదీ క్లాస్