పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సివస్తే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) అంశంపైనేనని స్పష్టం చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతు ఆపి.. దానిని నిర్మూలించే వరకు పాక్‌తో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా జన్ ఆశీర్వాద్ ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు రాజ్‌నాథ్.
"పాకిస్థాన్‌తో చర్చలు చేపట్టాల్సి వస్తే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపైనే. మరే సమస్యపైనా చర్చించే ప్రసక్తే లేదు. అధికరణ 370 రద్దు దాయాది దేశాన్ని బలహీనపరిచింది. వారికి అది ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు పాక్ ప్రతిఒక్క తలుపు కొడుతోంది. వారికి సహాయం అందించాలని వివిధ దేశాలను కలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా సైతం పాకిస్థాన్‌కు చివాట్లు పెట్టింది. భారత్‌తో చర్చలు జరపాల్సిందిగా ఆ దేశానికి హితవు పలికింది. "
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి.
ఉగ్రవాదం ద్వారా భారత్‌ను అస్థిరపరిచేందుకు, బలహీనపరిచేందుకు పాక్ యత్నిస్తోందని ఆరోపించారు రాజ్‌నాథ్. దానికి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గట్టి సమాధానమిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'పరిస్థితులను బట్టే అణ్వస్త్రాల వినియోగంపై నిర్ణయాలు'