రెచ్చగొట్టే చర్యలు చేపట్టినా భారత్ సంయమనం పాటిస్తోందని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కానీ దాడులకు పాల్పడితే.. శత్రుమూకలకు జీవితంలో మరిచిపోలేని సమాధానం చెబుతామని పాకిస్థాన్‌కు పరోక్ష హెచ్చరికలు పంపారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండేళ్లలో చేసిన 95 ప్రసంగాలపై ముద్రించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య.
"మీరు గమనిస్తూనే ఉన్నారు.. కొద్ది కాలంగా కొందరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నప్పటికీ మనము ఎలాంటి చర్య తీసుకోలేదు. కానీ ఒకవేళ ఎవరైనా దాడులు చేస్తే.. వారికి జీవితంలో మర్చిపోలేని సమాధానమిస్తాం. రెచ్చగొట్టేవారితో సహా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి"
- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు నేపథ్యంలో భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ వెంకయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చూడండి: జాబిల్లి కోసం: చంద్రయాన్-1 సూపర్ హిట్.. కానీ...