ఫిబ్రవరి 26నాటి వైమానిక దాడుల్లో జైషే ఉగ్రశిబిరాలకు నష్టం జరిగింది నిజమేనని వైమానిక అధికారులు వెల్లడించారు. ఉపగ్రహ చిత్రం, రాడార్ సిగ్నళ్ల ఆధారంగా పరిశీలిస్తే నష్టం పెద్దస్థాయిలో జరిగినట్లు తెలుస్తోందని అభిప్రాయపడ్డారు.
ఓ విదేశీ వార్తాసంస్థ బయటపెట్టిన చిత్రం జైషే స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉగ్రశిబిరాలకు ఏ మేరకు నష్టం జరిగిందన్న విషయమై దేశవ్యాప్త చర్చ నెలకొంది.
బాలాకోట్ దాడులపై పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం ఆదివారం మీడియాకు విడుదల చేసింది. ఎస్-2000 స్మార్ట్ క్షిపణులు లక్ష్యాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు జరిపాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. స్వతంత్ర సంస్థల నుంచి సైతం ఉపగ్రహ చిత్రాలను వైమానిక దళం సేకరించి ప్రభుత్వానికి సమర్పించిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
సంఖ్య చుట్టూ వివాదం..
గతవారం విదేశాంగ కార్యదర్శి విజయ్గోఖలే పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు మృతిచెందారని తెలపారు. ప్రభుత్వ వర్గాలు 350 మంది మృతి చెంది ఉంటారని ప్రకటించాయి. భాజపా నేత అమిత్షా 250 మంది మృతి చెంది ఉంటారని పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ 400 మంది అసువులు బాశారని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో బాలాకోట్ దాడుల్లో ఎంతమంది మృతి చెందారో తెలపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.