కొవిడ్‌తో విలవిలలాడుతున్న చైనాకు వైద్య సాయం అందించడం కోసం 15 టన్నుల వైద్య పరికరాలు, ఔషధాలతో భారత వాయుసేనకు చెందిన విమానం వుహాన్ నగరానికి బయలుదేరినట్లు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ మందులు చైనాకు ఉపయోగపడతాయని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
70ఏళ్లు పూర్తి!
'ఈ విమానంలో దాదాపు 15 టన్నుల వైద్య పరికరాలు, మందులు చైనాకు సరఫరా చేశాం. వాటిలో మాస్కులు, గ్లౌజులు సహా వివిధ రకాల అత్యవసర వైద్య సామగ్రి ఉన్నాయి. చైనాకు భారత్ అందిస్తున్న ఈ సాయం రెండు దేశాల ప్రజల మధ్య స్నేహానికి ప్రతీక. అదేవిధంగా సరిగ్గా ఈ సంవత్సరానికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తి కావడం విశేషం' అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
రేపే తిరుగు ప్రయాణం...
ఇప్పుడు వుహాన్ వెళ్లిన విమానం 80 మంది భారతీయులు, మరో 40 మంది పొరుగు దేశాల పౌరులతో రేపు వేకువజామున పాలం విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో వుహాన్ నుంచి 120మంది పౌరులతో పాటు ఐదుగురు పిల్లలను తిరిగి తీసుకొస్తున్నట్లు భారతీయ వైమానిక దళం తెలిపింది.
కొవిడ్ మహమ్మారి కారణంగా చైనాలో ఇప్పటి వరకు దాదాపు 2,715 మంది మరణించారని అక్కడి అధికారులు వెల్లడించారు. 78వేలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు తెలిపారు.
ఇదీ చూడండి: వితంతువులు, ఒంటరి మహిళలకూ ఇక సంతాన భాగ్యం
!