ఫిబ్రవరి 27న సొంత హెలికాప్టర్‌నే కూల్చిన ఘటనపై చర్యలకు సిద్ధమయింది భారత వాయుసేన. ఆరుగురు వాయుసేన అధికారులపై నిబంధనల ప్రకారం వ్యవహరించాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఇద్దరు అధికారులను కోర్టు మార్షల్‌కు, మిగిలిన నలుగురిపై పాలనాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రక్షణ శాఖలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
"ఆరుగురు వాయుసేన అధికారులు మరణించిన ఛాపర్ ప్రమాదం విషయంలో.. బృంద సారథితో పాటు వింగ్ కమాండర్‌పై కోర్ట్ మార్షల్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇద్దరు ఎయిర్ కామడోర్స్, ఇద్దరు ఫ్లైట్ లెఫ్టినెంట్లపై పాలనాపరమైన చర్యలు ఉంటాయి."
-రక్షణ శాఖ అధికారి
ఇదీ జరిగింది..
సమన్వయ లోపం కారణంగా ఫిబ్రవరి 27న జమ్ము కశ్మీర్‌లోని బుడ్గామ్‌లో భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు వాయుసేన అధికారులు మరణించారు.
ఫిబ్రవరి 26న పాక్‌లోని బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వైమానిక దాడులు చేసింది భారత వాయుసేన. ఈ దాడి మరుసటి రోజైన ఫిబ్రవరి 27న పాక్ వైమానిక దళం విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. పాక్ విమానాల్ని సమర్థంగా తిప్పికొట్టింది భారత వాయుసేన.
ఈ క్రమంలోనే పాక్ విమానాలను అడ్డుకునేందుకు శ్రీనగర్ వైమానిక స్థావరంలో ఉదయం 10.10 గంటలకు గాల్లోకి లేచింది హెలికాప్టర్. ఆ ఛాపర్ రాడార్ మన సైన్యానికి సిగ్నల్ ఇవ్వకపోవటం వల్ల శత్రువుదిగా భావించింది ఐఏఎఫ్. వెంటనే స్పైడర్ క్షిపణి వ్యవస్థ ద్వారా ఛాపర్‌ను క్షణాల్లో కూల్చివేసింది.
ప్రమాద సమయంలో ఛాపర్‌ను స్క్వాడ్రన్ లీడర్ సిద్ధార్థ్ విశిష్ఠ్ నడుపుతున్నారు.