పదవులపై తనకెలాంటి ఆశ లేదని రాజస్థాన్ కాంగ్రెస్ అసంతృప్త నేత సచిన్ పైలట్ మరోసారి ఉద్ఘాటించారు. పదవులు వస్తూపోతూ ఉంటాయని.. ప్రజల విశ్వాసం చూరగొనే విధంగా పనిచేయాలని పేర్కొన్నారు.
అశోక్ గహ్లోత్ అంటే తనకు వ్యక్తిగతంగా గౌరవం ఉందని అన్నారు సచిన్.
"నా కుటుంబం నుంచి కొన్ని విలువలను గ్రహించాను. నేను ఎంత వ్యతిరేకించినా.. అలాంటి భాష ఎప్పుడూ ఉపయోగించలేదు. అశోక్ గహ్లోత్ నాకన్నా పెద్దవారు. ఆయనంటే వ్యక్తిగతంగా నాకు గౌరవం ఉంది. కానీ మేం చేసే పనికి సంబంధించిన విషయాలపై సమస్యలను లేవనెత్తే హక్కు నాకు ఉంది."
-సచిన్ పైలట్, రాజస్థాన్ కాంగ్రెస్ నేత
తనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని అధిష్ఠానం నియమించిందని సచిన్ పైలట్ తెలిపారు. రాజకీయాల్లో అసూయ, వ్యక్తిగత శతృత్వం వంటి అంశాలకు స్థానం లేదని అన్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తమ సమస్యలను ఓపికగా విన్నారని, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వివరించారు.
ఇదీ చదవండి: 'మేం కలిసే ఉన్నాం.. మా సోదరభావం కొనసాగుతుంది'