అయోధ్యలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న శ్రీరామ మందిరం భూమిపూజకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయానికి భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ మహా ఘట్టానికి ఇంకా కొద్ది గంటల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో భాజపా అగ్రనేత అడ్వాణీ భావోద్వేగ సందేశంతో కూడిన ప్రకటన జారీ చేశారు. తనతో పాటు భారత ప్రజలందరికీ ఇదో చారిత్రక, ఉద్వేగభరిత క్షణమన్నారు. 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు తాను చేపట్టిన రథయాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు.
దృఢమైన, సుసంపన్నమైన, శాంతి, సామరస్యంతో కూడిన భారతావనికి రామ మందిరం ఓ ప్రతీకగా నిలుస్తుందని ఆడ్వాణీ విశ్వాసం వ్యక్తంచేశారు. అందరికీ సమ న్యాయం, సుపరిపాలన అందాలని, దేశం రామ రాజ్యంలా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రామజన్మభూమి ఉద్యమంలో భాగస్వామి కావడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
"భారతీయ సంస్కృతి, నాగరిక వారసత్వంలో శ్రీరాముడికి ఎంతో గౌరవ స్థానం ఉంది. భారతీయులందరిలో శ్రీరాముడిలోని సద్గుణాలు ప్రేరేపించేందుకు ఈ ఆలయం దోహదపడుతుందని నమ్ముతున్నాను."
-ఎల్కే అడ్వాణీ, భాజపా సీనియర్ నేత
రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొని ఎనలేని త్యాగాలు చేసిన సాధువులు, నేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం తీర్పుతో అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమవుతున్నందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. రామ మందిర నిర్మాణం ద్వారా భారతీయుల మధ్య బంధం బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో 93 ఏళ్ల ఆడ్వాణీ ఈ వేడుకకు దూరంగా ఉంటున్నారు.