ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పుర్‌కు చెందిన ఓ పెళ్లైన జంట ఇప్పుడు వార్తల్లోకెక్కింది. అదెలా అని అనుకుంటున్నారా.. చదువులో ప్రతిభ, ఎనలేని పట్టుదల, విశ్వాసం చూపి.
బిలాస్‌పుర్ వాసి అనుభవ్ సింగ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఎంపికవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి అదే విధంగా ముందుకెళ్లారు. చదువు పూర్తవగానే ప్రభుత్వ పరీక్షల కోసం సిద్ధమయ్యారు. 2008లో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే ఓ ఇన్స్టిట్యూట్లో అమ్మాయి పరిచయమైంది. పేరు విభా సింగ్. అప్పటి వారి పరిచయం ప్రేమగా మారింది. 2014లో అది కాస్తా వివాహబంధమైంది. పెళ్లయ్యాకా ఇరువురూ పోటీ పరీక్షలకు హాజరయ్యారు.
వారి కల ఫలించింది. అనుకున్నది సాధించారు. ఇటీవల నిర్వహించిన చీఫ్ మున్సిపల్ ఆఫీసర్(గ్రేడ్‌బీ, గ్రేడ్సీ) పరీక్షలకు ఇరువురూ హాజరయ్యారు. తాజాగా వెల్లడించిన ఫలితాల్లో ఈ భార్యాభర్తలిద్దరూ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అనుభవ్‌కు 298.3744 మార్కులు రాగా.. విభా సింగ్‌కు 283.9151 మార్కులొచ్చాయి.
జీవితంలో విజయం సాధించిన వారి ఆనందానికి అవధుల్లేవు. దాదాపు 11 ఏళ్లుగా కలిసి చదువుకున్న ఈ జంట ఏదైనా మాట్లాడుకోవడానికి కలిసి కూర్చున్నా.. అదో స్టడీ సెషన్‌ను తలపిస్తుందని చెబుతున్నారు.
''నా జీవితంలో ఈ క్షణం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. ఇది సాధించడానికి దాదాపు పదేళ్లు పట్టింది. ఈ గెలుపు అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇది నా ఒక్కని విజయం కాదు. నాకు తోడుగా నిలిచిన అమ్మ, భార్య, సహచరులు, స్నేహితులందిరి విజయమిది. అందుకే ఈ సమష్టి విజయంతో నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా.''
- అనుభవ్ సింగ్
విభాసింగ్.. గత ఏడేళ్లుగా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్(ఏడీఓ)గా పనిచేస్తున్నారు. ఇంట్లో పని, ఉద్యోగం చేసుకుంటూనే భర్తతో కలిసి పరీక్షలు రాశారు.
''మేం ఇద్దరమూ ఎంపికవుతామని నాకు తెలుసు. కానీ.. టాప్‌లో నిలుస్తామని ఊహించలేదు. ఈ సంతోషాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నా. 2012లో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యా.''
- విభా సింగ్, అనుభవ్ భార్య