విస్తారమైన అడవులు, సుందరమైన జలపాతాలు, రాచరిక నివాసాలకు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పెట్టింది పేరు. ప్రకృతి అందాలతో పాటు దట్టంగా విస్తరించిన ఆటవిక ప్రాంతంలో విరివిగా సంచరించే వన్యప్రాణులకు నెలవు. రాష్ట్ర రాజధాని రాయ్‌పుర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో 800 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది నందన్‌వన్ జంగిల్ సఫారీ. ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత అరణ్యం.... దేశ పర్యటక రంగంలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
దట్టంగా పరుచుకున్న పచ్చదనం, ఆహ్లాదంగా స్వాగతం పలికే ఉద్యానవనం.. ప్రకృతి రమణీయతను కళ్లకు కడుతుంది. ఆ సోయగాలను ఆస్వాదిస్తూ కొన్ని అడుగులు వేయగానే ఎదురొచ్చే సఫారీ సిబ్బంది.. అతిథులను గౌరవించే భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి అద్దంపడతారు.
మోదీ చేతుల మీదుగా...
పర్యటక రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ జంగిల్ సఫారీ ఏర్పాటు వెనుక గొప్ప సంకల్పం ఉంది. అనారోగ్యానికి గురైన జంతువులకు పునరావాసాన్ని కల్పించి, చికిత్స అందించే ఉద్దేశంతో మొదట 1979లో రాయ్‌పుర్‌లో 'నందన్‌వన్ మినీ జూ'గా ఏర్పాటైంది.
2000లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడిన అనంతరం.. రాజధాని నయా రాయ్‌పుర్ అభివృద్ధిపై దృష్టి సారించింది అక్కడి ప్రభుత్వం. 2011లో ఇక్కడ ప్రపంచ స్థాయి సఫారీ నిర్మాణంపై నిపుణులతో విస్తృతంగా చర్చలు జరిపారు అప్పటి ముఖ్యమంత్రి రమణ్‌సింగ్. తర్వాత అటవీశాఖ నుంచి భూమిని సేకరించిన అధికారులు.. సఫారీ నిర్మాణాన్ని ప్రారంభించారు. పూర్తిస్థాయి అడవిగా నిర్మితమైన నందన్‌వన్ జంగిల్ సఫారీని ప్రధాని నరేంద్రమోదీ 2016 నవంబర్ 1 న లాంఛనంగా ప్రారంభించారు.
'హెర్బివోర్'లో జింకల సందడి...
నందన్‌వన్ జంగిల్‌లో 4 సఫారీలుంటాయి. ప్రధాన ద్వారం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో 'హెర్బివోర్ సఫారీ' పేరుతో ఓ విభాగం ఉంటుంది. ఇక్కడ శాకాహారం మాత్రమే తినే జంతువులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. జింకలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. చీతల్, బ్లాక్ బక్, సంభర్, బ్లూ బుల్, బార్కింగ్ డీర్ లాంటి జింకలు సహా 300పైగా జాతులు ఇక్కడ దర్శనమిస్తాయి. వీటిని అతి దగ్గరగా చూసే అవకాశం కల్పించారు అధికారులు.
''చీతల్‌కు విశాల స్థలం కావాలి. అక్కడేమీ కనిపించట్లేదని మనకు అనిపిస్తుంది. కానీ చీతల్ లాంటి జీవులకు అలాంటి బహిరంగ ప్రదేశమే కావాలి. అందుకే వాటిని అలా ఉంచాం. హెర్బివోర్ సఫారీలో జంతువులకు ఆవాసాలు కల్పించడమే అసలు సమస్య. కానీ మాకు అది అంత కఠినమైన పనేం కాదు. శిక్షణ తీసుకున్న మా సిబ్బంది అందులో సఫలీకృతమవుతున్నారు.''
- అధికారి, నందన్‌వన్ జంగిల్ సఫారీ.
'బేర్' సఫారీ...
హెర్బివోర్ సఫారీని దాటిన వెంటనే.. పర్యటకులు 'బేర్' సఫారీలో అడుగుపెడతారు. ఇక్కడ దాదాపు 5 రకాల ఎలుగు జాతులుంటాయి. ప్రమాదకరమైన ఎలుగుబంట్లకు సైతం ఇక్కడ స్వేచ్ఛగా విహరించే అవకాశం కల్పించారు. వీటిని మాత్రం బస్సులోంచే చూడాలి. కిందకు దిగేందుకు అనుమతించరు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సఫారీలో ఎలుగు బంట్లను అత్యంత దగ్గరగా చూడొచ్చు.
పులులూ.. సింహాల్నీ దగ్గర్నుంచీ..
హెర్బివోర్, బేర్ సఫారీలకు కొద్ది దూరంలోనే మరో 50 ఎకరాల దట్టమైన ప్రాంతంలో నిర్మితమైన 'పులి సఫారీ' పర్యటకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ప్రస్తుతం అక్కడ ఆశ్రయం పొందుతున్న పులుల్ని చాలా దగ్గరగా చూసే అవకాశముంది.
'టైగర్ సఫారీ'కి ఆనుకునే.. అడవికి రారాజుగా చెప్పుకునే సింహాల సామ్రాజ్యం ఉంది. 'లయన్ సఫారీ' విస్తీర్ణమూ 50 ఎకరాలే. పులుల్లా ఒంటరిగా కాక.. సింహాలెప్పుడూ కుటుంబంతో కలిసి జీవిస్తాయి.
బోటింగ్.. వలస పక్షుల రాక అదనపు ఆకర్షణ....
నందన్‌వన్ జంగిల్ సఫారీలోని 130 ఎకరాల్లో విస్తరించి ఉన్న కండువా సరస్సులో బోట్లలో విహరించే సదుపాయం కూడా ఉంది. దేశవిదేశాల నుంచి వేలాదిగా వలస వచ్చే పక్షులూ సఫారీలో దర్శనమిస్తాయి.
సఫారీ జంగిల్‌లో బొటానికల్ గార్డెన్, జూ నిర్మించే యోచనలో అధికారులు ఉన్నారు. అదనంగా మరో 32 జాతుల జంతువులను ఈ 'జూ'లో చేర్చనున్నారు. ఇప్పటికే వీటి నిర్మాణం ప్రారంభించారు. పర్యటకులకు ప్రాకృతిక సౌందర్యాన్ని చేరువ చేస్తున్న సఫారీ... జంతువుల సహజ ఆవాసాలను పునఃసృష్టించడం సహా 200 మందికి పైగా స్థానికులకు ఉపాధి కల్పిస్తోంది.
ఇన్ని ప్రత్యేకతల కారణంగానే ఈ నందన్‌వన్ జంగిల్ సఫారీ.. ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒక్కసారైనా.. ఇక్కడకు వెళ్లాలని తహతహలాడుతుంటారు పర్యటకులు.