‘జాయ్‌రే జాయ్ గంజాయిరోయ్... హెల్తు వెల్తు పెంచు మస్తు మస్తు మత్తుమందురోయ్’ అన్న గంజాయి గీతాన్ని ఇప్పుడు పార్టీలకతీతంగా నాయకులందరూ తన్మయత్వంతో ఆలపిస్తున్నారు. ‘పదండి ముందుకు... పదండి తోసుకు... పోదాం పోదాం గంజాయి వనాలకు... దమ్ము కొడుతూ దుమ్ము రేపుతూ నిర్మిద్దాం ఆరోగ్యభారతాన్ని! మనసారా మైకంలో మునుగుతూ తరిమేద్దాం రోగభూతాల’నంటూ పిలుపిస్తున్నారు.
ప్రజల బాగు కోసం ఏదైనా చేయగలిగిన ఇలాంటి మనసున్న మారాజులకు ఉత్తరాఖండ్ సరికొత్త దారిదీపం. వైద్య, పారిశ్రామిక అవసరాల కోసమంటూ గంజాయి సాగును చట్టబద్ధం చేసిన ఆ రాష్ట్రం, ఆధునిక భారత చరిత్రలో ఓ సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. తామూ తొందర్లో అదే పని చేయబోతున్నామని మధ్యప్రదేశ్ న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ తాజాగా ప్రకటించారు. ప్రజారోగ్య పరిరక్షణా కంకణబద్ధులైన హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్ ఏలికలూ ఈ విషయాన్ని తీవ్రాతితీవ్రంగా పరిశీలిస్తున్నారు. రేపోమాపో చేసేస్తారు. మిగిలిన రాష్ట్రాలూ త్వరపడితే దేశమంతా గంజాయి గుబాళిస్తుంది. ఆ మాదకపు ధూమపానంతో ఆబాలగోపాలమూ పరవశిస్తుంది.
గంజాయి సాగును చట్టబద్ధం చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి కాబట్టి చేసేద్దామనుకుంటున్నాం అని వాక్రుచ్చారు హిమాచల్ ముఖ్యమంత్రివర్యులు జైరాం ఠాకూర్. ఎంత మంచి మనసు? రహదారులు, ఆస్పత్రుల్లాంటివి కావాలని అడిగేవాళ్లందరూ అవివేకులు. వాళ్ల డిమాండ్లను పట్టించుకోకపోయినా రాష్ట్రానికి నష్టమేమీ లేదు. అదే గంజాయి కావాలనుకునేవారి కోరికను తీరిస్తే ఎంత లాభం? మాదకాదాయంతో ఖజానా నిండిపోదూ! దాంతో ఎన్నెన్ని ఓటరు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టొచ్చు? ఏలినవారి ఆంతర్యాన్ని అర్థం చేసుకోరూ...!
గంజాయి సాగు వల్ల యువతకు ఉపాధి అవకాశాలు ఊపందుకుంటాయని ఘంటాపథంగా చెబుతున్నారు హిమాచల్‌కే చెందిన ఎంపీ మహేశ్వర్ సింగ్. నమ్మండి! నిజంగానే ఇది గొప్ప ఆలోచన!! ‘నిరుద్యోగికి నాలుగు గంజాయి మొక్కలు’ పథకం ప్రవేశపెడితే ఉపాధికి ఇక ఢోకా ఉండదు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం తెలియక మేధావులందరూ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. నీతిఆయోగ్ లాంటివైతే ఉపాధికల్పనకు ఏవేవో సూచనలు చేస్తున్నాయి. అబ్బే... వాటిలో ఏమాత్రం సృజనాత్మకత ఉండట్లేదు. గంజాయి సాగు చేయించడంతోపాటు యువతతో కొకైన్ కొట్లు, హెరాయిన్ అంగళ్లూ పెట్టిస్తే మాదక‘ద్రవ్య’ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో దేశం కళకళలాడిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం మోగించండి... భంగు సింగినాదాలు! రద్దు చేసెయ్యండి మత్తుమందుల నిషేధ చట్టాలు!
గంజాయి దమ్ముతో మనిషి దిమ్మయిపోతాడని... మెదడు మొద్దుబారి అనేకానేక రోగాల బారినపడతారని వైద్యులు నెత్తినోరూ కొట్టుకుంటున్నారు! ఆ ప్రమాదకర జబ్బులకూ గంజాయే దివ్యౌషధమని నాయకులకు తెలుసన్న విషయం పాపం వీళ్లకు తెలియదు. ఏ రోగం వస్తేనేమి, గట్టిగా ఒక్కసారి గంజాయి దమ్ముకొడితే- ఒంటికి ఏ బాధా తెలియదన్నది నేతాశ్రీల అంతర్లోచన. కాణీ ఖర్చుతో అయిపోయే గ‘మ్మత్తు’ వైద్యమిది. నిండుమనసుతో దీన్ని ప్రోత్సహిస్తున్న నాయకోత్తములను తప్పుపట్టినవారికి పచ్చి భంగు కూడా పుట్టదు. తస్మాత్ జాగ్రత్త!
‘గంజాయి వనంలో తులసి మొక్క’ అని చెప్పుకొంటూ ఉంటాం కానీ, తులసి గొప్పేంటంట! ఏవో కొన్ని ఔషధ గుణాలున్నాయి తప్ప- మనిషి లోపలి కళాకారుణ్ని బయటికి తీసే శక్తి ఉందా తులసీదళానికి? పాటలీపుత్ర మాజీ చక్రవర్తి లాలూప్రసాదుడి సుపుత్రుడు తేజప్రతాపుడు గంజాయి దమ్ము కొట్టగానే గాగ్రా వేసుకుంటాడట. అచ్చం రాధలా మారిపోయి కృష్ణుడి కోసం విరహ నృత్యాలు చేస్తాడట! వాటిని చూసి ఠారెత్తిపోయిన భార్య ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదిచ్చారంటే, గంజాయి గొప్పదనానికి ఇంతకంటే సాక్ష్యమేమి కావాలి. నిశిరాత్రిలో ఊళవేసే నక్కల్లా గంజాయి మత్తులో గమకాలాలపించే కుర్రాళ్లు కోకొల్లలు. నాయకోత్తముల తాజా నిర్ణయాలతో వాళ్లందరూ పరమానంద భరితులవుతున్నారు. ఆనందబాష్పాలతో కరతాళ ధ్వనులు చేస్తున్నారు.
హైదరాబాదు నుంచి అమరావతి వరకూ మన గడ్డ మీద గంజాయి దొరకనిచోటు లేదు. టీనేజీ కుర్రాళ్లు సైతం మాయదారి మత్తుమందుకు బానిసలవుతున్నారని పుంఖానుపుంఖాలుగా వార్తలు వినబడుతున్నాయి. ఇవన్నీ అర్థంపర్థం లేని అపప్రథలూ ఆందోళనలు.
వారికి అలా సులువుగా గంజాయిని అందుబాటులో ఉండేలా అహరహమూ శ్రమిస్తున్న తెరచాటు పెద్దమనుషులు ఎంతటి పుణ్యాత్ములు! వీళ్ల మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్న యంత్రంగానిదెంతటి ఘనత! చాటుమాటు సేవనాల మూలంగా ఈ ఖ్యాతి అంతా అడవి కాచిన వెన్నెల అయిపోతోంది.
హతవిధీ... ఉత్తరాది ఒరవడిలో ఇక్కడా రాచపందిళ్ల కింద గంజాయిని సాగుచేయించి, ఆ కల్పవక్ష కరుణా కటాక్షాలకు పాత్రులైతే సర్వే సర్వత్రా లాభదాయకం కదా!
శుభస్య శీఘ్రం!!
- సత్యభారతి
ఇదీ చూడండి : ఝార్ఖండ్‌లో అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ నేడే..