కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపు అన్ని దేశాల్లో కొవిడ్-19 విశ్వరూపం చూపిస్తోంది. చాలా దేశాల్లోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్క చైనాలో మాత్రమే ఈ వైరస్ నాలుగో దశకు చేరింది. ఈ దశలో వైరస్ నియంత్రించలేని స్థాయికి చేరుతుంది. వైరస్ వ్యాప్తి చేసే క్లస్టర్లు దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 65 వేల మందికి పైగా ప్రజలను బలిగొన్న ఈ మహమ్మారి.. భారత్‌లో మూడో దశకు చేరకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఒకవేళ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వైరస్ మూడో స్టేజీకి చేరితే ప్రభుత్వాలకు తిప్పలు తప్పవు. భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించడం పెను సవాల్‌గా మారుతుంది.
మురుగునీటి విశ్లేషణ
అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడటానికి కొందరు శాస్త్రవేత్తలు భిన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఓ వర్గం అంతటికీ ఒకే విధానంతో పరీక్షలు నిర్వహించేలా అడుగులు వేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించే అవసరం లేకుండా ఆ ప్రాంతంలోని మురికినీరును విశ్లేషించి ఎంతమందికి వైరస్ సోకిందో అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థలో చేరే మలమూత్ర నమూనాల్లో కొవిడ్-19 ఉండే అవకాశాన్ని విశ్లేషిస్తున్నారు.
అయితే కేవలం ఒక్కరిని లెక్కలోకి తీసుకోకుండా ఆ ప్రాంతంలోని మొత్తం జనాభాను ప్రతిబింబించే నమూనాలను పరిగణలోకి తీసుకోవాలని ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ అలయన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ఇప్పటివరకు నెదర్లాండ్స్, అమెరికా, స్వీడన్ దేశాల్లో 'మురికి నీటి' విధానాన్ని అనుసరించి వైరస్ ఆనవాళ్లు గుర్తించారు.
దశాబ్దాల నుంచే ఉంది
మురుగునీటి ద్వారా రోగ లక్షణాలు పరీక్షించడం ఎప్పటి నుంచో అమలులో ఉంది. పోలియో వైరస్ టీకాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఈ పద్ధతిని దశాబ్దాల నుంచి ఉపయోగిస్తున్నట్లు ట్యూసన్లోని అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ సూక్షజీవశాస్త్రవేత్త చార్లెస్ గెర్బా వెల్లడించారు.
తరచుగా చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్‌ను అడ్డుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఇలాంటి జాగ్రత్తలు మానేసిన తర్వాత ప్రాణాంతక మహమ్మారి తిరిగి ప్రబలే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి: బందీపోటుగా పవన్.. ప్రత్యేకగీతంలో పూజిత!