కరోనా విజృంభణతో అన్ని రంగాలు మూతపడ్డాయి. లాక్డౌన్ కారణంగా వ్యాపారస్థులు బాగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో జూన్ 8 నుంచి తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యాపారాలు తిరిగి ప్రారంభించుకోవచ్చని అనుమతినిచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు కొవిడ్-19 కారణంగా మునుపటి స్థాయిని ప్రస్తుతం అందుకోవడం కష్టమేనని సర్వేలు చెబతున్నాయి. మళ్లీ వినియోగదారులతో కళకళలాడాలంటే 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని భావిస్తున్నాయి.
వ్యాపార రంగం.. జూన్- ఆగస్టు త్రైమాసికంలో సుమారు 20 నుంచి 30 శాతం పుంజుకుంటాయన్న సర్వే.. 50 శాతం మేర బలపడటానికి 2021 జనవరి- మార్చి వరకూ వేచిచూడాలని పేర్కొంది.
హోటల్ మేనేజర్ల సర్వే ఏమంటోందంటే..
హోటల్ జనరల్ మేనేజర్లు ఏప్రిల్లో నిర్వహించిన మరో సర్వేలో.. నాల్గవ త్రైమాసికంలో 40 శాతం మేర మాత్రమే పుంజుకుంటాయని 46 శాతం మంది చెప్పారు. మరో 42 శాతం మంది మాత్రం వచ్చే ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలోనే 50 శాతం వరకు కళకళలాడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
180 హోటళ్లపై..
సుమారు 180 హోటళ్లపై ఏప్రిల్లో నిర్వహించిన ఈ సర్వేలో... 2019 ఏప్రిల్ తో పోలిస్తే వ్యాపార రంగం 81 శాతం మేర పడిపోయిందని వెల్లడైంది. సింగపూర్లో ఈ ప్రభావం 30 శాతం వరకు ఉండగా.. వైరస్ ప్రారంభమైన నాటినుంచి చైనాలో 48 శాతం మేర క్షీణించింది.
ఇదీ చదవండి: లాక్డౌన్లో ఎక్కువ మంది బయటకు వచ్చింది ఇందుకే!