కేంద్ర హోంశాఖ.. వెయ్యికి పైగా కొత్త ఉద్యోగాల నియామకానికి పచ్చ జెండా ఊపింది. పరిశ్రమలు, విమానాశ్రయాలు, అణు ఉత్పత్తి కేంద్రాలు, మెట్రో స్టేషన్లు వంటి ప్రదేశాల్లో విధులు నిర్వహించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో(సీఐఎస్ఎఫ్) నూతనంగా 1,018 పోస్టుల సృష్టికి కేంద్ర హోంశాఖ ఆమోద ముద్ర వేసింది.
ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ 60 విమానాశ్రయాల్లో విధులు నిర్వహిస్తోంది. వీవీఐపీల భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్(ఎస్ఎస్జీ) కూడా సీఐఎస్ఎఫ్ విభాగంలోనే పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్లో 899 పోస్టులు, 119 ఇతర ఉద్యోగాల కల్పనకు ఆమోదం తెలిపింది హోంశాఖ.
నూతనంగా జారీ చేయనున్న ఉద్యోగాలతో.. రాబోయే రెండేళ్లలో నూతన బెటాలియన్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్లో 1,08,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
ముంబయి దాడుల అనంతరం..
2008 నాటి ముంబయి దాడుల్లో తాజ్ హోటల్లో జరిగిన విధ్వంసం నేపథ్యంలో ప్రైవేటు సంస్థలకు భద్రత కల్పించే బాధ్యతనూ సీఐఎస్ఎఫ్కు అప్పగించారు. ఇలా 12 పైగా ప్రైవేటు సంస్థలకు సేవలు అందిస్తోంది సీఐఎస్ఎఫ్.
ఇదీ చూడండి: కరోనా వల్ల వరుడు లేకుండానే పెళ్లి అయిపోయింది!