జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును ఎగతాళి చేసిన వారిని శిక్షించే అవకాశం మహారాష్ట్ర ప్రజలకు ఇప్పుడు వచ్చిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్నికలను భాజపా 'కార్యశక్తి', కాంగ్రెస్-ఎన్సీపీ 'స్వార్థశక్తి'కి మధ్య పోరాటంగా అభివర్ణించిన ఆయన.. ప్రజలు స్వార్థశక్తికి వ్యతిరేకంగా భాజపాకు ఓట్లు వేయాలని కోరారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్లీ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ఎన్నికల్లో ఘన విజయం సాధించి అన్ని రికార్డులూ తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజాధనాన్ని దోచుకున్న వారిని జైలుకు పంపే ప్రక్రియ ప్రారంభమైందని మోదీ వివరించారు. ప్రచారంలో భాజపా ర్యాలీలకు వస్తున్న ప్రజా మద్దతును చూసి కాంగ్రెస్-ఎన్సీపీ నేతలు ఊపిరితిప్పుకోలేకున్నారని పేర్కొన్నారు.
" ఎన్నికల్లో ఒకవైపు భాజపా కార్యశక్తి, మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీ స్వార్థశక్తి.. పోటీపడుతున్నాయి. ప్రజలు కార్యశక్తినే ఎన్నుకుంటారు. స్వార్థశక్తిని ఎప్పటికీ ఎన్నుకోరు. మందుగా మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేసి అక్కడి దళితులు, పిల్లలు, మహిళలకు దేశంలో అన్ని రాష్ట్రాల మాదిరిగానే అధికారాలను కల్పించాం. ఈ విషయంలో మరోసారి కాంగ్రెస్ ఎన్సీపీ స్వార్థం బయటపడింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిని, ఎగతాళి చేసిన వారిని చరిత్ర గుర్తుంచుకుంటుంది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి