దేశంలోని ప్రధాన నగరాలు పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్నాయి. కర్ణాటక బెంగళూరులోని టౌన్హాల్లో ఆందోళన నిర్వహించిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది ఇతర పార్టీ నేతలనూ నిర్బంధించారు. తన అరెస్టు అప్రజాస్వామికమని గుహ అన్నారు. శాంతియుత నిరసనలకూ పోలీసులు అనుమతించడం లేదని చెప్పారు.
రామచంద్ర గుహ అరెస్టుపై దుమారం చెలరేగుతోంది. పోలీసుల చర్యలపై బయోకాన్ ఎండీ కిరణ్ మజుందర్ షా షాక్‌కు గురయ్యారు. శాంతియుత నిరసనలు చేపట్టడం ప్రాథమిక హక్కు అని.. పోలీసులు ఇలా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. గుహ అరెస్టుపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హసన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశ్నించే గొంతులను మూయాలని చూస్తున్నారని ఆరోపించారు. వారి భద్రతపై ఆందోళనగా ఉందన్నారు. చరిత్రకారులను ప్రభుత్వం భయపెట్టాలని చూస్తోందని విమర్శించారు తృణమూల్ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
పౌర చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటకవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు అధికారులు. ఈ చట్టాన్ని నూటికి నూరు శాతం కర్ణాటకలో అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి యడియూరప్ప ఇప్పటికే తేల్చి చెప్పారు.
ఇదీ చూడండి: 'పౌర' సెగ: దిల్లీ మళ్లీ హింసాత్మకం- నేతలు, విద్యార్థులు అరెస్ట్