దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీలో జరిగిన నిర్భయ హత్యాచార దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు తిహార్ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో దోషులకు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరిస్తే మరణశిక్ష వెంటనే అమలుచేయాలని భావిస్తున్నారు. అయితే, ఉరితీసేందుకు తిహార్ జైలులో తలారి లేనందున అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక తలారీగా తనను నియమించాలంటూ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాసిన లేఖలో కోరారు.
‘తిహార్ జైల్లో తాత్కాలిక తలారిగా నన్ను నియమించండి. అప్పుడు నిర్భయ దోషులకు త్వరగా ఉరిశిక్ష అమలు చేయడానికి వీలవుతుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుంది’ అని సిమ్లాకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సాధారణంగా మన దేశంలో ఉరిశిక్షలు ఎప్పుడో గానీ అమలు కావు. అందుకే తలారీ విధుల్లో శాశ్వతంగా ఎవర్నీ తీసుకోరు. తిహార్ జైల్లో చివరిసారిగా పార్లమెంట్ దాడుల దోషి అఫ్జల్ గురును ఉరితీశారు. ఆ తర్వాత తలారి అవసరం రాలేదు. ఇప్పుడు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాల్సి వచ్చినందున తలారి కోసం అధికారులు వేట మొదలుపెట్టారు.
ఇదీ చూడండి : కేంద్ర హోంశాఖ వద్దకు నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్