ఖురాన్.. ముస్లింల పవిత్ర గ్రంథం. కానీ రాజస్థాన్‌లోని ఓ హిందువు ఇంటి పూజ గదిలో.. ఏళ్లుగా ఆ గ్రంథం నిత్య పూజలందుకుంటోంది. భగవద్గీతతో సమానంగా, అత్యంత పవిత్రంగా కాపాడుకుంటూ మతసామరస్యాన్ని చాటుతోంది ఆ కుటుంబం. వంశపారపర్యంగా కొలుచుకుంటున్న ఆ గ్రంథం.. ప్రపంచంలోనే అత్యంత చిన్న ఖురాన్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు ఆ హిందూ కుంటుబసభ్యులు.

రాజస్థాన్, అజ్మేర్కు చెందిన బాలకిషన్ ఖండేల్వాల్ ఓ హిందువు. హిందూ మత గ్రంథాలను, ఆచారాలను పక్కాగా పాటిస్తారు. అయితే ఇస్లాం మత గ్రంథమైన ఖురాన్‌నూ అంతే పవిత్రంగా కొలుస్తారు బాలకిషన్. దాదాపు 45 ఏళ్ల క్రితం తన తండ్రి ఈ చిన్ని ఖురాన్‌ను అప్పగిస్తూ.. ఇదే మనింటి శుభాలకు మూలమని చెప్పారట. అప్పటి నుంచి ఈ బుల్లి ఖురాన్‌ను ఎంతో పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారు బాలకిషన్.


1.8 అంగుళాల పొడవు, 1.8 అంగుళాల వెడల్పు ఉండే ఈ ఖురాన్‌ను భద్రంగా దాచేందుకు.. అగ్గిపెట్టె పరిమాణంలో ఓ సుందరమైన వెండి పెట్టెను తయారు చేయించారు బాలకిషన్. రోజూ ఉదయం, సాయంత్రం ఖురాన్‌ను బయటకు తీసి అత్తరు పూసి.. భక్తితో కళ్లకు అద్దుకొని మళ్లీ ఆ పెట్టెలో పెట్టేస్తారు. ఇక ఏదైనా పండగొస్తే మాత్రం.. ప్రత్యేక పూజలు, నమాజ్‌లు నిర్వహిస్తారు.

బాలకిషన్ ఇంట్లో పవిత్రంగా చూసుకుంటున్న ఈ ఖురాన్ బరువు కేవలం 1.9 గ్రాములు. అతి తక్కువ బరువుతో, తక్కువ పరిమాణం కలిగిన ఈ గ్రంథంలో దాదాపు 258 పేజీలున్నాయి. దీంతో ఈ ప్రత్యేక ఖురాన్ ఇప్పటికే 'రాజస్థాన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో పేరు నమోదు చేసుకుంది. అంతేకాదు 'గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లోనూ స్థానం కల్పించాల్సిందిగా ధరఖాస్తు చేశారు బాలకిషన్.
ఇదీ చదవండి: 'అయోధ్య తరహాలో మథుర, కాశీకి విముక్తి!'