భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రూ.వేల కోట్లు వెచ్చించినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్(సీఎంఎస్) సంస్థ నివేదిక వెల్లడించింది. ఎన్నికల ఖర్చుల తీరుతెన్నులు చూసి ప్రజాస్వామ్య శ్రేయోభిలాషులు నిర్ఘాంతపోయారని పేర్కొంది.
రూ.60వేల కోట్ల వ్యయం
ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓటర్లపై వెచ్చించిన మొత్తం రూ.60వేల కోట్లకుపైగా ఉంటుందని సీఎంఎస్ వెల్లడించింది. ఒక్కో లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల సగటు వ్యయం రూ.100కోట్లకుపైగా ఉందని తెలిపింది. ఇక రకరకాల ప్రచార వ్యూహాలు, ప్రచారాలు, బెట్టింగులు, ఇతరత్రా వ్యయాలన్నీ కలుపుకుంటే ఈ మొత్తం ఖర్చు అనూహ్యంగా ఉంటుందని సీఎంఎస్ పేర్కొంది.
సోమవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎంఎస్ నివేదిక విడుదల చేసింది.
'ఎన్నికల్లో విచ్చలవిడి ధన ప్రవాహం మమ్మల్ని భయాందోళనకు గురి చేసింది. దేశంలో ప్రజాస్వామ్య పునాదుల్ని చెక్కుచెదరకుండా కాపాడుకోవాలంటే తక్షణమే సరైన చర్యలు తీసుకోవాల్సి ఉంది' అని సీఎంఎస్ ఛైర్మన్ ఎన్. భాస్కర్ రావు అభిప్రాయడ్డారు. నివేదిక విడుదల కార్యక్రమానికి రాజకీయ పార్టీలను ఆహ్వానించినా.. ఏ ఒక్క పార్టీ ప్రతినిధులను పంపించలేదని ఆయన తెలిపారు.
పారదర్శకత, గోప్యత పేరుతో ఎన్నికల వ్యయాలకు కార్పొరేట్ నిధులు ప్రధాన వనరులుగా మారాయన్నారు భాస్కర్ రావు.
నివేదిక విడుదల సందర్భంగా నిర్వహించిన చర్చా కార్యాక్రమంలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషీ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మహాకూటమిపై ఎస్పీ, బీఎస్పీ చెరో మాట