మహారాష్ట్ర కొంకణ్ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఠాణె సహా ముంబయి మహా నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జన జీవనం స్తంభించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జగ్రత్తలు పాటించాలని సూచించారు ముంబయి నగర పాలక సంస్థ అధికారులు. సముద్ర తీరానికి దూరంగా ఉండాలని కోరారు.
ఆరెంజ్ అలర్ట్..
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముంబయి నగరంలో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. సంబంధిత అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. మరో రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఠాణె, పాల్ఘర్ సహా ఇతర తీర ప్రాంత జిల్లాల్లో మంగళవారమే ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. భారీ నుంచి, అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పాల్ఘర్ జిల్లాలో 128, రాయ్‌గఢ్ జిల్లాలో 122.6, దక్షిణ ముంబయిలో 121.6, రత్నగిరీలో 101.3, కొల్హాపుర్‌లో 35.2, తూర్పు మహారాష్ట్రలో 16.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ ముంబయి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేఎస్ హొసలికర్ ప్రకటించారు.
ఇదీ చూడండి: రాజస్థాన్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు!