అరేబియా సముద్రం తూర్పు, మధ్య ప్రాంతంలో అల్పపీడనం సహా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కేరళలో మరోసారి భారీ వర్షాలు పడుతున్నాయి. కొచ్చిలో జోరు వానలతో రహదారులు జలమయమయ్యాయి. నగరంలో కుంభవృష్టి కారణంగా అనేక లోతట్టు ప్రాంతాల్లోకి నీరుచేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎర్నాకులంలో కుంభవృష్టి...
ఎర్నాకులంలో జోరు వానకు జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. ఎక్కడికక్కడ వాహనాలు నీటిలో చిక్కుకుపోగా వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రైల్వే పట్టాలపై నీరు ప్రవహిస్తుండడం వల్ల పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. వందలాది మంది రైల్వేస్టేషన్లలోనే పడిగాపులు కాస్తున్నారు.
మిగిలిన జిల్లాల్లోనూ...
రాజధాని తిరువనంతపురంతోపాటు అలప్పుజ, కొట్టాయం, త్రిస్సూర్, ఇడుక్కి, వయనాడ్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. తిరువనంతపురం పరిధిలో నడిచే అన్ని పాసింజర్ రైళ్లను రద్దు చేశారు.
పోలింగ్‌కు ఆటంకం...
రాష్ట్రంలో 5 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికలు జరుగుతోన్న జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
ఎర్నాకులం జిల్లాలోని 10 పోలింగ్ కేంద్రాల్లో భారీ వర్షాల కారణంగా ఓటింగ్‌కు అంతరాయం కలిగింది. పోలింగ్ సామగ్రి తడవకుండా జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల కోసం ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించారు.
7 జిల్లాలకు రెడ్ అలర్ట్...
కేరళలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా ఒక్కో జిల్లాకు ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తరలించింది.
- ఇదీ చూడండి: అమరావతిలో కిరాతక దాడి- రాష్ట్ర మంత్రి పనే!