కరోనా ఒక్కసారి వచ్చిపోయే వ్యాధి కాదని.. దాని దీర్ఘకాలిక పరిణామాలను అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేయాల్సిన అవసరముందని అంటున్నారు జర్మన్ శాస్త్రవేత్తలు. ఇటీవల కొవిడ్ నుంచి కోలుకున్న 100 మందిలో దాదాపు 80 మంది ఏదో ఒక గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని తేలిందని స్పష్టం చేశారు.
జర్మనీకి చెందిన ఫ్రాంక్ ఫర్ట్ హాస్పిటల్ చేపట్టిన ఈ అధ్యయన ఫలితాలు.. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సుమారు 49 ఏళ్లలోపున్న వందమందిపై చేపట్టిన ఈ అధ్యయనంలో.. ఇంట్లోనే వైరస్ను జయించిన 67 మంది, 33 మంది ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నవారు పాల్గొన్నారు.
సీఎంఆర్ స్కానింగ్ నిర్వహించిన ఆ వంద మందిలో 78 మందికి అసాధారమైన హృద్రోగ లక్షణాలు కనిపించగా... 71 మంది రక్తపు నమూనాల్లో మాలిక్యూల్ హై సెన్సిటివిటీ ట్రోపోనిన్ టీ అధికంగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారిలోనే 60 మంది ఛాతీ మంటతో బాధపడుతున్నారని తేలింది. అయితే, ఇదివరకే గుండె సమస్యలతో బాధపడేవారి లక్షణాలు, కరోనా సోకిన తర్వాత లక్షణాలు వేరువేరుగా ఉన్నాయని స్పష్టమైంది.
ఈ అధ్యయనంలో 18 ఏళ్ల లోపువారు గానీ, లక్షణాలు కనిపించకుండా కరోనా సోకి జయించిన వారుగానీ పాల్గొనలేదు కాబట్టి.. వారిలో గుండె సమస్యలు ఉన్నాయా లేవా అనేది స్పష్టం అవ్వలేదని నివేదికలో పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.
ఇదీ చదవండి: ఆ దేశాలకు భారత్ నాయకత్వం!