కరోనా మధ్యస్థ దశలో యాంటీవైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌ను ఉపయోగించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం సిఫార్సు చేసింది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచే టోసిలిజుమాబ్ మందుకూ అనుమతి ఇచ్చింది. కరోనా తీవ్రత మితమైన దశలో రోగుల చికిత్సకు ప్లాస్మా మార్పిడికి ఆమోదం తెలిపింది.
అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై వాడకంపై 'కొవిడ్-19 చికిత్స విధాన నిబంధనల'ల్లో కొన్ని సవరణలు చేసింది. ఈ మలేరియా మందును వ్యాధి ప్రారంభ సమయంలోనే ఉపయోగించాలని స్పష్టం చేసింది. వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న వారికి అజిత్రోమైసిన్‌తో కలిపి వాడవద్దని స్పష్టం చేసింది.
దుష్ప్రభావమే కారణమా?
హైడ్రాక్సీక్లోరోక్విన్ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ఇన్-విట్రో కార్యకలాపాలను ప్రదర్శించిందని అధ్యయనాలు వెల్లడించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ మద్దతు కావాల్సిన అత్యసవర పరిస్థితుల్లో రెమిడెసివిర్ వినియోగించవచ్చని సిపార్సు చేసింది.
అయితే తీవ్రమైన మూత్రపిండాల లోపం, అధిక స్థాయి కాలేయ ఎంజైమ్‌లు, గర్భిణీలు, పాలిచ్చే మహిళలు, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి రెమిడెసివిర్ వాడకూడదని స్పష్టం చేసింది. దీనిని ఇంజెక్షన్ రూపంలో మొదటి రోజు 200 మిల్లీగ్రాములు, అనంతరం ఐదు రోజులపాటు 100 మిల్లీగ్రాముల చొప్పున ఇవ్వాలని సూచించింది.