లాక్‌డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉంటున్న వృద్దులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉండవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది. ప్రస్తుత సంక్లిష్ట సమయంలో ఎవరికి వారు రోజువారీ పనుల్లో నిమగ్నం కావడం, పిల్లలతో సరదాగా గడపడం, దూరంగా ఉంటే ఫోన్లో మాట్లాడటం, చిన్న చిన్న కసరత్తులు చేయడం, ఇండోర్ గేమ్స్ లాంటి వాటి ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని సూచించింది.
కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు..
- కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడపడం, కుటుంబ చర్చల్లో భాగస్వాములు కావడం వల్ల ఆందోళన, ఒత్తిడిని తగ్గుతుంది. ఒక వేళ పిల్లలు దూరంగా ఉంటే.. వారితో ఫోన్‌లో లేదా వీడియో కాల్స్ ద్వారా వారికి అనుసంధానమై ఉంటే మంచిది.
- రోజంతా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. పొద్దుపోవడానికి ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలి. తోట పని, ఇంటి పని, వంట పనుల్లో తలమునకలైతే ఆందోళన తగ్గుతుంది. సాయం చేయడానికి ఇంట్లో ఎవరూ లేకపోతే.. ఇంటి సరుకులు, మందులు, ఇతర అత్యవసరాలు తెచ్చి ఇవ్వడానికి ఎవరో ఒకరి మద్దతు తీసుకోవాలి.
- ఇలాంటి ఒత్తిడి సమయంలో ఆహ్లాదకరమైన వినోద కార్యక్రమాల్లో మునిగిపోవాలి. పజిల్స్ పూర్తి చేయడం, క్యారంబోర్డు, చెస్ లాంటివి ఆడుకోవడం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి.
- దూరంగా ఉంటున్న పిల్లలు, మనుమలు, మనవరాళ్ల క్షేమం గురించి ఆందోళన చెందకుండా.. వారితో తరచూ ఫోన్, వీడియోకాల్స్ మాట్లాడుతూ... ఒత్తిడి తగ్గించుకోవాలి.
- శారీరకంగా చురుగ్గా ఉండటం ముఖ్యం. అందుకని సులభమైన కసరత్తులు, యోగాసనాలు వేయడం, ఇంట్లోనే నడవటం, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా బావుంటుంది.
- ఎక్కడ చూసినా.. కరోనా మహమ్మారి వార్తలే కనిపిస్తుంటాయి. అందులో నిజమైనవెన్నో.. నిర్ధరించుకోవడం కష్టం. అందువల్ల నిరంతరం వార్తలు చూడవద్దు. అవి కలత కలిగించ వచ్చు, తప్పుదోవ పట్టించవచ్చు. అందువల్ల విశ్వసనీయమైన మార్గాల వార్తలనే స్వీకరించాలని. ఏదైనా అవసరం అయితే.. 080-46110007కి కాల్ చేయాలి.