జమ్ముకశ్మీర్‌పై మోదీ సర్కారు నిర్ణయాన్ని పార్లమెంట్ సాక్షిగా చాలా పార్టీలు సమర్థించాయి. మోదీ-షా ద్వయం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కొనియాడాయి. కానీ మొదట్నుంచి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌కు లోక్‌సభలో ఊహించని పరిస్థితి ఎదురైంది. పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని భావించి.. భాజపాకు అనుకూలమైన మాటలతో సెల్ఫ్ గోల్వేసుకున్నట్లయింది హస్తం పార్టీ పరిస్థితి.
ఇవాళ ఉదయం లోక్‌సభలో అధికరణ 370 రద్దు, జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ ప్రారంభమవగానే.. జమ్ముకశ్మీర్ అంశం దేశ అంతర్గతమా లేక ద్వైపాక్షిక సంబంధమా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు.
రంజన్ మాటలకు పక్కనున్న యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ సైతం నిర్ఘాంతపోయారు. విషయం పక్కదారి పడుతుందని భావించి.. తన వెనకున్న నేతలనూ అడిగారు. పరిస్థితిని గమనించిన అధిర్ రంజన్.. సర్దిచెప్పుకునేందుకు విఫలయత్నం చేశారు.
" మీరు ఈ అంశాన్ని అంతర్గత వ్యవహారమని అంటున్నారు సరే.. ఒక రాష్ట్రాన్ని విడదీశారు సరే.. కానీ నేను అనేదేంటంటే.. 1948 నుంచి కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి పర్యవేక్షిస్తోంది ఇది అంతర్గత విషయమా? సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ చేసుకున్నారు.. ఇది అంతర్గత సంబంధమా? ద్వైపాక్షిక ఒప్పందమా? కొన్ని రోజుల క్రితం విదేశాంగ మంత్రి జై శంకర్.. అమెరికా మంత్రి పాంపియోతో మాట్లాడారు. ఆ సమయంలోనూ ఇది ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నారు. వీటన్నిటి తర్వాత ఇది అంతర్గత విషయమో కాదో ప్రభుత్వం చెప్పాలి. నేను మీ ద్వారా జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మొత్తం జ్ఞానోదయం పొందాలనుకుంటోంది. ఇది ప్రాథమిక ప్రశ్న. కాంగ్రెస్ దేశానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు చెప్తున్నారు. అలా ఏం కాదు.
- అధిర్ రంజన్ చౌదరి, లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత
అధిర్ రంజన్ మాటలను భాజపా ఖండించింది. "ఇన్నాళ్లూ తల లేని కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మెదడు లేనిదిగా మారింది" అని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తీవ్ర విమర్శలు చేశారు.
" కశ్మీర్ దేశ అంతర్గత భాగం కాదని, ఈ అంశం అంతర్గతమైనది కాదని మీరు ఎలా అంటున్నారు. ఓటమితో నిరాశ చెందిన కాంగ్రెస్ నేతలు మానసికంగా దెబ్బతిన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు సభలోనే ఉన్నారు. కానీ ఎవరూ అధిర్ మాటలను సమర్థించలేదు."
-ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మంత్రి